కబ్జా కోరల్లో రూ.కోట్ల భూమి

22 Jun, 2016 14:01 IST|Sakshi

కనిగిరిలో రెచ్చిపోతున్న భూ బకాసురులు
అక్రమార్కుల చెరలో  ప్రభుత్వ, పోరంబోకు భూములు
నిద్ర నటిస్తున్న అధికారులు

కనిగిరి: భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. జాగా కన్పిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలు ఎరజూపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. అటవీ పోరంబోకు, అసైన్డ్, వాగు, గ్రేజీంగ్ భూములను ఆక్రమించేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిద్రనటిస్తున్నారు. కనిగిరి మండలం చల్లగిరిగిల్లలో పశువుల మేత భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆక్రమణకు ఉపక్రమించాడు. 10.71 ఎకరాల భూమి(సుమారు రూ.10లక్షలు)ని వీఆర్వో ద్వారా రికార్డులు ట్యాంపరింగ్ చేసి అక్రమంగా ఇద్దరి పేర్లపై ఎక్కించుకున్నాడు. 

 పామూరు మండలంలో..
మోపాడు రిజర్వాయర్ తొట్టిప్రాంతంలో విలువైన సుమారు 100 ఎకరాల తొటిభూమిని  టీడీపీ నాయకులు ఆక్రమించగా,

నెల్లూరు రోడ్డులోని సర్వేనంబర్ 447 ఎదురుగా ఉన్న రూ 50లక్షల విలువ చేసే  ప్రభుత్వ భూమిని అక్రమించి లేఅవుట్‌లు వేసారు.

నెల్లూరు రోడ్డులోని వల్లీ, భుజంగేశ్వరస్వామి, మదన వేణుగోపాలస్వామి, ఇనాం, దేవదాశీ భూములు రూ 5కోట్ల విలువ చేసేవీ టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కాగా సమస్య  కోర్టులోనలుగుతుంది. కోట్ల విలువచేసే బ్రహ్మంగారి, శంకరమ్మ మఠంకు చెందిన స్థలాలు ఆక్రమణలో ఉన్నాయి. కొత్తచెరువుకు వచ్చే కాల్వను సైతం ఆక్రమించుకున్నారు.

 సీఎస్‌పురంలో..
పెదగోగులపల్లిలో 392 సర్వే నంబర్‌లో 70 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా అధికార పార్టీ నాయకులు 60 ఎకరాల వరకు ఆక్రమించు కుని జామాయిల్ పంట సాగు చేశారు.

 వెలిగండ్లలో..

బొంతగుంట్లపల్లిలో సర్వే నంబర్ 77లో 133.55 ఎకరాలు, సర్వేనెంబర్ 65లో 414.25 పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ రెండు సర్వే నంబర్లలో 75 శాతం భూమి ఆక్రమణకు గురైంది.

వెలిగండ్ల పరిధిలో సర్వే నంబర్ 749, 752బై1లో 4.89 సెంట్లు ఆక్రమణలో ఉంది. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేశారు.

 హనుమంతునిపాడులో..
కోటతిప్పల, కొండారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాల్లో ఆక్రమణదారులు 222 సర్వే నంబర్‌లో 240 ఎకరాలు, 207, 205, 206లో గల భూమిని ఆక్రమించి, జామాయిలు సాగు చేశారు.

మహమ్మదాపురం రెవెన్యూలో సర్వే నంబర్ 415,421,420, 405,413,417,439,లో భూమి ఆక్రమించి సాగు చేశారు.

ముప్పళ్లపాడు రెవెన్యూలో 220 సర్వేనంబర్‌లో 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి జామాయిలుసాగు చేశారు. ఇవి కొన్ని మచ్చుకకు మాత్రమే.

కబ్జాలకు కేరాఫ్‌గా పీసీపల్లి.. పీసీపల్లిలో మండలంలో భూ ఆక్రమణదారులు రెచ్చిపోయి కబ్జా చేస్తున్నారు. ముద్దపాడు పంచాయతీలో రూ.1.20 కోట్ల విలువ చేసే 43 ఎకరాల గ్రేజింగ్ పోరంబోకు భూమిపై అధికార పార్టీ గద్దల కన్ను పడింది. అధికారులను మెత్తపరిచి దున్నకాలు చే స్తున్నారు. అప్పలవాడికుంట వద్దగల 364, 374 సర్వే నంబర్లలోని గ్రేజింగ్ భూమిని ఎన్.అంకయ్య, జి.చెన్నయ్య అక్రమంగా సాగు చేస్తున్నట్లు సర్పంచ్ లక్ష్మమ్మ 2015 జూన్ 22న కలెక్టర్, జేసీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు సాగును అడ్డుకుని ప్రభుత్వ భూమిగా బోర్డును పెట్టారు.

పశువుల బీడు భూమి కావడంతో అప్పట్లో సర్పంచ్  దానిని పేదలకు ఇవ్వాని తీర్మాన ం చేశారు. ఈ భూమిలో ప్రభుత్వ నిధులతో పనులు కూడా చేశారు. మరలా రోజుల నుంచి అక్రమార్కులు ప్రభుత్వ బోర్డును పడేసి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. సర్పంచ్ ఎస్.లక్ష్మమ్మ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. అలాగే  పీసీపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి 83 ఎకరాల్లో కొందరు అక్రమంగా జామాయిల్ సాగు చేశారు. రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చి చేయిదులుపు కున్నారు. మురిగమ్మిలో 450 ఎకరాల అటవీ పొరంబోకు, బంజరు భూమిని అక్రమంగా సాగుచేస్తున్నారు. అక్రమార్కులు దీనికి దొంగ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌లు జరిపినట్లు సమాచారం. పెదఇర్లపాడు రెవెన్యూ పరిధిలో 250 ఎకరాలను, గుంటుపల్లి పంచాయతీలొ గ్రేజిగ్ పొరంబోకు, ఆటవిపోరంబోకు, ఆనాదినం, చింతగుంల్లి రెవిన్యూలొ వందలాది ఎకరాలలో అక్రమ సాగు జరుగుతోంది.

మరిన్ని వార్తలు