బెజవాడ రెస్టారెంట్లలో సీటీవోల తనిఖీలు

23 Sep, 2016 09:13 IST|Sakshi

విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖాధికారులు గురువారం నగరంలోని 15 రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విజయవాడ రాజధానిగా మారినప్పటికీ రెస్టారెంట్ల నుంచి పన్నుల రాబడి పెరగకపోవడంతోపాటు పుష్కరాల సందర్భంగా ఆశించిన రాబడి రాకపోవడంతో ఆగ్రహించిన ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు  సీటీవో స్థాయి అధికారుల్ని 15 బృందాలుగా ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. బందరురోడ్డు, ఏలూరురోడ్డు, మొగల్రాజపురంలోని రెస్టారెంట్లతో పాటు రెండు మూడు బ్రాంచీలు కలిగిన రెస్టారెంట్లపైన అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు జరిగాయి.  


పుష్కరాల్లో అంత సీన్ లేదు
పుష్కరాల సందర్భంగా రెస్టారెంట్లలో ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పుష్కరాల రోజుల్లో అక్షయప్రాత, టీటీడీ, దుర్గగుడి వంటి ధార్మిక సంస్థలు పెద్దఎత్తున అన్నదాన ప్రసాదాలు వితరణ చేశాయని, అనేక స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేయడంతో కొన్ని రెస్టారెంట్లు సాధారణ రోజుల్లో కంటే తక్కువ వ్యాపారాలు చేసినట్లు తెలిసింది. అందువల్లనే పన్నులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ కట్టలేదు. ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న  ఒకటి, రెండు రెస్టారెంట్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.

>
మరిన్ని వార్తలు