శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించుకోవాలి

12 Sep, 2016 23:21 IST|Sakshi
శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించుకోవాలి
 
  • అలరించిన గాత్రకచేరి
  • ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి జయంత్యుత్సవాలు ప్రారంభం
 
నెల్లూరు(బారకాసు): శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సింహపురి కల్చరల్‌ అకాడమీ, సంస్కృతి తరంగాలు సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి శతజయంత్యుత్సవాలు సోమవారం రాత్రి పురమందిరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. భారతీయ సాంస్కృతిక సంగీతాలను మరిచి పాశ్చాత్య సంగీతాన్ని అలవర్చుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల వారు భారతీయ సంగీతం వైపు ఆకర్షితులవుతుంటే భారతీయలు మాత్రం ఇతర దేశాల సంగీతాన్ని ఇష్టపడటం దురదృష్టకరమన్నారు. ఎంతో ప్రాచీనం పొందిన శాస్త్రీయ సంగీతాలు కనుమరుగవుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడాన్ని అభినందించారు. మూడు రోజుల పాటు జరిగే జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
అలరించిన గాత్ర కచేరి
పురమందిరంలో జరిగిన శాస్త్రీయ సంగీత విభావరితో పలువురు పులకించారు. చెన్నైకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు విఘ్నేష్‌ ఈశ్వరన్‌ తన బృందంతో ఆలపించిన గాత్రకచేరి ఆహూతులను అలరించింది. ‘జగదానంద కారక’ సాధించినే ఓ మనసా’ పంచరత్న కీర్తన, ఆదితాళం.. ‘శ్రీమన్నారాయణ’, అన్నమాచార్య రచన, భౌళిరాగం, ఆదితాళం.. ‘నన్ను పాలింప’, తదితర కీర్తనలు ఆహూతులను ఓలలాడించాయి. పుదుకోటై రామనాథన్‌(వయోలిన్‌), ఇలపావులూరి పినాకపాణి(మృదంగం), మారుతీ రఘురామ్‌(ఘటం)తో వాయిదాన్ని అందించారు. రేణిగుంట రాజశేఖర్‌ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, సహస్ర సభాసింహం నరసింహం, కావలి వ్యవసాయ మార్కెటింగ్‌ చైర్మన్‌ దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, ప్రముఖ వ్యాపారవేత్త కొండా బలరామిరెడ్డి, పంచాగ్నుల వెంకటవిశ్వనాథం, వల్లకవి వెంకటసుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు