రక్తి కట్టిన నాటకం

13 Jan, 2017 22:43 IST|Sakshi
రక్తి కట్టిన నాటకం

వేషం అదిరింది. నాటకం రక్తి కట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే నటించుమంటే వారంతా జీవించారు. అందరిలోనూ ఆలోచనను రేకెత్తించారు. ఔరా అనిపించారు. అందుకు ప్రశాంతినిలయం వేదికైంది. సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనం మూడో రోజు వేడుకల్లో భాగంగా అనంతపురం, ముద్దనహళ్లి క్యాంప్‌స్‌ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మనిషి వేసే ప్రతి అడుగులోనూ పొందే ప్రతి అనుభవమూ దైవస్వరూపమేనన్న సందేశాన్ని చక్కగా తమ నాటిక ద్వారా వివరించారు. దేవుడు ఇందులేడందుగలడన్న సందేహమే లేదని, మానవుని ప్రతి అనుభవంలో, పొందే ప్రతి ఫలితంలోనూ దేవుడు దాగి ఉన్నాడన్న సందేశాన్ని చక్కగా వివరించారు.

దేవుని దర్శనం కోసం ఆలయాలకు వెళ్లడం కన్నా అభాగ్యుల సేవలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవడమే నిజమైన దర్శనమన్న సందేశంతో నాటికను ముగించడం అందరినీ ఆలోచింపజేసింది. విష్ణుభక్తుడైన భక్తప్రహల్లాదకు శివభక్తుడైన తన తండ్రి హిరణ్యకషిపుడుతో అపద ఎదురైనప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై రక్షించిన తీరును  కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అపార భక్తిప్రపత్తులు కలిగిన నారాయణ అనే భక్తుడి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుడు తన లీలను ప్రదర్శించి పరిష్కరించిన తీరును వివరించిన విధం కట్టిపడేసింది. అంధుడైన రామదాసు అనే భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళితే ఆత్మ స్వరూపుడుగా వెంకటేశ్వరుడు దర్శన భాగ్యం కల్పించిన తీరునూ అద్భుతంగా ప్రదర్శించారు.  
- పుట్టపర్తి టౌన్‌

మరిన్ని వార్తలు