కైగట్టి పాడుతూ.. గజ్జెకట్టి ఆడుతూ..

13 Sep, 2016 22:56 IST|Sakshi
కైగట్టి పాడుతూ.. గజ్జెకట్టి ఆడుతూ..
 • ధూం.. ధాంగా పాటల తూటాలు..
 • సిరిసిల్ల జిల్లా సాధనకు గళమెత్తిన గాయకులు..
 • సిరిసిల్ల : ‘‘ ఓ కేటీఆర్‌ సారూ.. మా ఐటీ మంత్రిగారు.. సిరిసిల్ల జిల్లా హామీ.. ఏమైందో చెప్పు సారూ..’’ అంటూ కళాకారులు గళం విప్పుతే.. చప్పట్లు మోగాల్సిందే. సిరిసిల్ల జిల్లా సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకుంటున్నాయి. పాటలను కైగట్టి పాడుతూ.. గజ్జె కట్టి ఆడుతూ అలరిస్తున్నారు. సిరిసిల్ల డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ.. జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు కళాకారులు.
  తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో
  తెలంగాణ సాధన ఉద్యమంలో ఆట.. పాటలు ఎంతగా ప్రభావం చూపాయో ఆ తరహాలోనే అదే బాణీల్లో సిరిసిల్ల సాధన ఉద్యమంలోనూ కళాకారులు పాటలు పాడుతున్నారు. విద్యావంతులైన కళాకారులు సరికొత్త బాణీల్లో పాటలను కైగట్టి గానం చేస్తున్నారు. డప్పుల మోతలు, గజ్జెల సంగీతంలో పాటలు పరుగు పెడుతున్నాయి. ‘‘సిరిసిల్ల మాకు జిల్లా.. నగాదారిలో.. జిల్లా కావాలే నగాదారిలో..’’ అంటూ డిగ్రీ చదువుతున్న బైరగోని చంద్రం పాటందుకుంటే.. ఉరకలెత్తే ఉత్సాహం కలుగుతుంది. బతుకమ్మ పాటలు, పీరీల ఆటలు, కులవృత్తుల స్మరణలతో కళాకారులు గొంతెత్తి పాడుతున్నారు.
  డప్పు దరువుల మోతలు...
   జిల్లా సాధన ఉద్యమంలో డప్పు దరువులు ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. కళాకారుల దరువులు లేచి డ్యాన్స్‌ చేయాలన్నంతా ఉత్సహాన్ని తెప్పిస్తుంది. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన కళాకారులు కులేరి కిశోర్, సామల్ల బాబు, బర్కుటి విజయ్, రాయల తిరుపతి, డప్పు పర్శరాములు, నక్క శ్రీకాంత్, పిల్లిట్ల రమేశ్, బర్కుటి సురేశ్, బైరగోని చంద్రం బృందం సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో ధూం.. ధాం..గా ఉర్రూతలూగిస్తున్నారు. న్యాయవాదులు, జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కళాకారుల బృందం ముందుకు సాగుతుంది.
   
   
మరిన్ని వార్తలు