నగదు అందక రోడ్డెక్కిన జనం

12 Dec, 2016 14:31 IST|Sakshi
నగదు అందక రోడ్డెక్కిన జనం
 జాతీయ రహదారిపై రాస్తారోకో
ఉంగుటూరు :
సొమ్ములు లేవని బ్యాంకు అధికారులు బోర్డు పెట్టడంతో ఆగ్రహించిన ఖాతాదారులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఎస్‌బీఐ శాఖలో  డబ్బులు లేవని బోర్డు పెట్టడంతో జనం ఆందోళనకు దిగారు. డబ్బు కోసం ప్రతి రోజు బ్యాంకు వద్ద క్యూలో నిలబడినా సక్రమంగా అందటం లేదని, ఇప్పుడు అసలు నగదు లేదనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు మూడు రోజుల సెలవుల నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. తమ ఖాతాల్లోని డబ్బు చేతికిరాక కుటుంబ పోషణ భారంగా మారిందని నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చేబ్రోలు ఎస్సై  చావా సురేష్‌ వచ్చి వాహనాలను పంపించే ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. చివరకు అందరికీ నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. 
 
 
 
 
మరిన్ని వార్తలు