-

‘చిల్లర’ కష్టాలు

9 Nov, 2016 23:07 IST|Sakshi
‘చిల్లర’ కష్టాలు

– పెద్దనోట్ల రద్దుతో స్తంభించిన లావాదేవీలు
– బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు బంద్‌
– పెట్రోల్‌బంకు వద్ద బారులు తీరిన జనం
– పెద్ద నోట్లను నిరాకరిస్తున్న వ్యాపారులు


హిందూపురం అర్బన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న నోట్లను డిసెంబరు 31 లోపు మార్పు చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా చిల్లర కోసం ప్రజలు పెట్రోల్‌ బంకుల్లో ఉదయం నుంచి బారులు తీరారు. అయితే యజమానులు మాత్రం చిల్లర ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. దీంతో వాహనాదారులు నోట్లకు సరిపడా పెట్రోల్‌ తప్పనిసరిగా వేయించుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో బజారులో చిల్లర కష్టాలు మొదలయ్యాయి.

మొదలైన నోట్ల వ్యాపారం
పెద్దనోట్లు తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తుండటంతో ఇదే అదునుగా కొందరు చిల్లర ఇస్తామని వ్యాపారానికి తెరలేపారు. చిన్నమార్కెట్, ముద్దిరెడ్డిపల్లి, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో రూ.500కు రూ.400 ఇస్తామని రూ.1000కి రూ.800 ఇస్తున్నట్లు తెలిసింది. కాగా బెంగళూరు నుంచి కొందరు కార్లు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున రూ.వంద నోట్లను తీసుకువచ్చి రహస్యంగా లాడ్జీలు, ఇళ్లల్లో ఉండి పెద్ద మొత్తానికి చిల్లర వ్యాపారం చేయడానికి సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు