నోట్ల కష్టాలు గవర్నర్‌కు విన్నవిస్తాం

19 Dec, 2016 21:52 IST|Sakshi
నోట్ల కష్టాలు గవర్నర్‌కు విన్నవిస్తాం
 
విజయపురిసౌత్‌ : నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను వివరించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గవర్నర్‌ను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. విజయపురిసౌత్‌లోని మాచర్ల జెడ్‌పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుల్లో సైతం చిన్ననోట్లు అందుబాటులోకి రాలేదన్నారు. రైతులు, సన్న, చిన్నకారు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.  పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక   రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోట్ల రద్దు విషయం ముందుగానే తెలిసినా ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయారని   ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంపై ప్రధానికి స్వయంగా లేఖ రాశానని చెప్పటమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని  చూపించాల్సిన బాధ్యత అటు ప్రధాని మోదీపై, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు.  వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ రాష్ట్ర గవర్నర్‌ను మధ్యాహ్నం 2.30 గంటలకు కలిసి ప్రజల బాధలను వివరిస్తామన్నారు. అనంతరం జెడ్‌పీటీసీ గోపిరెడ్డి విజయపురిసౌత్‌లో పారిశుధ్య సిబ్బంది లేకపోవటంతో ఎక్కడ చెత్త అక్కడే నిలిచి వీధులు అపరిశుభ్రంగా ఉన్నాయని, సిబ్బంది నియామకం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు జూలకంటి వీరారెడ్డి, బూడిద శ్రీను తదితరులు ఉన్నారు.  
 
మరిన్ని వార్తలు