నగదు కొరత..ప్రజల వ్యథ

12 Dec, 2016 15:13 IST|Sakshi
నగదు కొరత..ప్రజల వ్యథ
– బ్యాంకుల్లో గంటల తరబడి నిరీక్షణ
- నందికొట్కూరులో బ్యాంకులోనే రిటైర్డ్‌ ఉద్యోగి మృతి
- దాచుకున్న డబ్బు తీసుకోలేక అల్లాడుతున్న ఖాతాదారులు
- కర్నూలులో నిబంధనలు పాటించని ఓ బ్యాంకు
- ఇష్టానుసారంగా నగదు మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): బ్యాంకుల్లో నగదు కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం ఒకే రోజు రూ.24వేలు లేదా వారంలో విడతలుగా అంతే మొత్తంలో తీసుకోవచ్చు. నగదు కొరతతో చాలా బ్యాంకుల్లో ఇంత మొత్తం ఇవ్వడం లేదు. దీంతో ఖాతాదారులు విసిగిపోతున్నారు. వృద్ధులు క్యూలో నిల్చోలేక కుప్పకూలి పోతున్నారు. నందికొట్కూరులోని ఎస్‌బీఐ బ్రాంచిలో విత్‌డ్రా కోసం వచ్చిన రిటైర్డ్‌ ఉద్యోగి.. నగదు లేదనే మాటను విని వరుసలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.  
 
అడ్డదారిలో..
దాచుకున్న డబ్బులో రూ.4వేలు ఇవ్వడానికి లేదంటున్న కొందరు బ్యాంకు అధికారులు ..అడ్డదారిలో మాత్రం కొంతమందికి రద్దయిన పాత నోట్లను తీసుకొని కొత్తనోట్లను ఇస్తున్నట్లు  విమర్శలు ఉన్నాయి. ఈ తతంగం కర్నూలు నగరంలోని ఒక ముఖ్యమైన బ్యాంకులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు సమయం ముగిసిన తర్వాత దళారులు వెళ్లి పాత నోట్ల కట్టలు ఇచ్చి కొత్తకరెన్సీ కట్టలు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా సదరు బ్యాంకు అధికారికి ముడుపులు భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది. ఈ తంతు ఇటీవల జరిగింది. జిల్లాకు ఎంత కరెన్సీ వచ్చింది.. ఇందులో ఏఏ బ్యాంకుకు ఎంత ఇచ్చారు. దానిని ఏఏ ఖాతాదారులకు ఎంతెంత ఇచ్చారు... విచారణ జరిపితే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.  నోట్ల మార్పిడికి ఆధార్‌ నెంబర్లు తీసుకుంటున్నారు. విత్‌డ్రాకు పరిమితులు ఉన్నాయి. కాని పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలు బయటికి రావడం చర్చనీయాంశం అయింది. అడ్డదారిలో నోట్ల కట్టలు బయటికి రావడంతో బయట కొంత మంది 20 నుంచి 30 శాతం కమీషన్‌ ఇస్తే నల్లడబ్బును వైట్‌ చేస్తామంటున్నట్లు తెలుస్తోంది.  
ఏ బ్యాంకుల్లోను డబ్బుల్లేవ్‌....
జిల్లాలో 34 బ్యాంకులు ఉన్నాయి. వీటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 445 బ్రాంచిలు ఉన్నాయి. కరెన్సీ చస్ట్‌లు ఉన్న బ్యాంకులతోపాటు మిగతా వాటిలోనూ నగదు కొరత  ఏర్పడింది. బాంకుల్లో దాచుకున్న డబ్బు అవసరానికి ఉపయోగించే పరిస్థితి లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని పనులు వదలు కొని విత్‌డ్రా కోసం బ్యాంకులకు వెళ్తున్నా... నగదు లేదు... రేపురా అనే సమాధానం ఎదురవుతోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు ప్రతి బ్రాంచ్‌లో  కనీసం రూ. 2 కోట్ల నగదు ఉండేది.  నేడు రూ.2 లక్షలు కూడా లేవంటే బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా తయారు అయిందో ఊహించవచ్చు. రోజువారి చెల్లింపులకు జిల్లా మొత్తం మీద రూ. 100 కోట్లు అవసరం ఉంటుంది. నేడు జిల్లా మొత్తం మీద రూ.10 కోట్లు లేవు. 
రిటైర్డ్‌ ఉద్యోగి మృతి....
నందికొట్కూరుకు చెందిన బాలరాజు(65) అనే రిటైర్డ్‌ ఉద్యోగి దాచుకున్న డబ్బలోంచి కొంతమొత్తం విత్‌ డ్రా చేసుకునేందుకు నాలుగు రోజులుగా స్థానిక బ్యాంక్‌కు వెళ్తున్నారు. రోజూ నగదులేదంటూ వెనక్కి పంపుతున్నారు. శుక్రవారం కూడ వచ్చి వరసలో నిలబడ్డారు. ఉన్న దాంట్లో ఒక్కొక్కరికి రూ.2వేలు, 4వేలు ఇస్తుండగా తన ముందు మరో ఇద్దరు ఉండగా నగదు అయిపోయిందని విత్‌డ్రాను ముగించారు. దీంతో ఆయన ఒక్కసారిగా ఆందోళనకు గురి కావడంతో గుండెపోటు వచ్చింది. వరసలోనే కుప్ప కూలి బ్యాంకులోనే మృతి చెందాడు. 
 పెరగిన కష్టాలు....
రిజర్వుబ్యాంకు నోట్ల మార్పిడి నిలిపివేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇక్కట్లు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా ఆర్‌బీఐ తీరుపై బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.100, 50, 20, 10 నోట్ల కొత్త కరెన్సీని ౖహెదరాబాద్‌లోని ప్రయివేటు బ్యాంకులకు ..పాత కరెన్సీని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇస్తున్నారని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు.  
>
మరిన్ని వార్తలు