రోడ్డెక్కిన ఖాతాదారులు

14 Dec, 2016 22:26 IST|Sakshi
రోడ్డెక్కిన ఖాతాదారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న పాట్లు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా బ్యాంకుల ఎదుట భారీగా క్యూలు దర్శనమిచ్చాయి. బ్యాంకుల్లో సరిపడా నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. తణుకు మండలం వేల్పూరు ఎస్‌బీఐ ఎదుట ఖాతాదారులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బ్యాంకులో డబ్బులు లేవని ఉద్యోగులు చెప్పడంతో ఖాతాదారులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అక్కడకు చేరుకుని ఖాతాదారుల నిరసనకు సంఘీభావం తెలిపారు. బ్యాంకు డీజీఎంతో ఫోనులో మాట్లాడి చెస్ట్‌  బ్యాంకు నుంచి రూ.15 లక్షలు రప్పించి అప్పటికప్పుడు ఖాతాదారులకు పంపిణీ చేయించారు. పాలకోడేరు మండలం మోగల్లు ఎస్‌బీఐకి ఖాతాదారులు పెద్దఎత్తున రాగా కేవలం 200 మందికి నగదు ఇచ్చారు. మిగిలిన వారికి కూపన్లు అందించారు. బ్యాంకులో డబ్బులు ఉంటే ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పాలకొల్లు ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద ఖాతాదారులు బ్యాంక్‌ మేనేజర్‌తో వాగ్వివాదానికి దిగారు. ప్రతిరోజు రూ.2వేలు ఇచ్చే కన్నా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఖాతాదారులకు, బ్యాంకు సిబ్బందికి వాగ్వివాదం జరిగింది. పట్టణ సీఐ రజనీకుమార్‌ వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ద్వారకాతిరుమలలో మొత్తం 5 ఏటీఎంలు ఉంటే, ఒక్క ఆంధ్రాబ్యాంకు ఏటీఎం మాత్రమే తెరచుకుంది. తాడేపల్లిగూడెం మండలం మాధవరం ఆంధ్రాబ్యాంకు వద్ద రెండు వందల మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి బ్యాంకుకు వచ్చిన నగదుకు అనుగుణంగా సొమ్ము ఇస్తామని చెప్పారు. కొమ్ముగూడెంలో ఇండియన్‌ బ్యాంక్‌ శాఖలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఖాతాదారుల రద్దీ పెరగడంతో తోపులాటలు జరిగాయి. చింతలపూడిలో ఎస్‌బీఐ ఏటీఎం ఒక్కటే పని చేసింది.   
 
 
మరిన్ని వార్తలు