కరెన్సీ కష్టాలు.. కంటిన్యూ!

5 Jan, 2017 00:07 IST|Sakshi
కరెన్సీ కష్టాలు.. కంటిన్యూ!

ఇంకా తెరుచుకోని ఏటీఎంలు..
పనిచేస్తున్న వాటిలో పెద్ద నోట్లే..
చిల్లరతో చిరు వ్యాపారుల విలవిల


నిజామాబాద్‌ : కరెన్సీ కష్టాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేసి సుమారు రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ.. ప్రజలకు నోట్ల ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా అవసరాల మేరకు రూ.500, రూ.100 నోట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లాలో చిల్లర సమస్య తీవ్రమైంది. ఇది చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజువారి వ్యాపారాలు సాగక, గిరాకీలు పడిపోవడంతో రెక్కాడితే గానీ డొక్కాడని చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారు.

తెరుచుకోని ఏటీఎంలు..
ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులు కలిపి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 371 బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులకు సంబంధించి 345 ఏటీఎంలు ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ఆయా బ్యాంకుల మెయిన్‌ బ్రాంచుల వద్ద ఉన్న కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ఏటీఎంలు పనిచేయడం ప్రారంభించాయి. పనిచేస్తున్న ఈ ఏటీఎంలలో కూడా రూ.100 నోట్లు, రూ.500 నోట్లు వస్తున్న ఏటీఎంలు నామమాత్రమే. ఎక్కువ ఏటీఎంలలో రూ.2 వేల నోట్లే వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కొనసాగుతున్న ఆంక్షలు..
బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాకు ఆంక్షలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. వారానికి రూ.24 వేల పరిమితి ఇంకా ఎత్తివేయలేదు. రోజుకు ఇచ్చే రూ.4 వేల పరిమితిని కొంత సడలించారు. రూ.10 వేల వరకు ఇస్తున్నారు. దీంతో ఆయా బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా కోసం బారులు కొంత మేరకు తగ్గాయి. కానీ.. రద్దీ మాత్రం అలాగే కొనసాగుతోంది.

సుమారు రూ.6 వేల కోట్ల డిపాజిట్లు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్ల నగదు డిపాజిట్‌ అయినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ఖాతాదారులు రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను తమ ఖాతాల్లో వేస్తున్నారు. అయితే డిపాజిట్‌ల మేరకు కొత్త కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. సుమారు రూ.6వేల కోట్లు డిపాజిట్లు అయితే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే జిల్లాకు కొత్త కరెన్సీ వచ్చినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల అంచనా. అంటే డిపాజిట్లు అయిన మొత్తంలో కనీసం 20 శాతం కూడా కొత్త నోట్లు జిల్లాకు రాలేదు. ఇలా జిల్లా అవసరాల మేరకు కరెన్సీ జిల్లాకు చేరకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కరెన్సీ కోసం పలుమార్లు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

యథేచ్ఛగా అక్రమాలు..
సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే నల్ల కుబేరులు తమ బ్లాక్‌ మనీని పెద్ద మొత్తంలో వైట్‌ మనీగా మార్చుకున్నారు. ఇందుకు కొన్ని బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకారంతో భారీ మొత్తంలో నగదు అక్రమ మార్పిడి జరిగింది. ముఖ్యంగా బడా వ్యాపారులకు బ్యాంకు అధికారులు సహకరించారనేది బహిరంగ రహస్యంగా మారింది. నల్లదనం ఉన్న వారు తమ కరెన్సీని రూ.100 నోట్లుగా మార్చుకుని తమ వద్ద ఉంచుకోవడంతో కూడా చిల్లర సమస్యకు పరోక్ష కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు