ఆవేదన.. ఆక్రోశం

14 Dec, 2016 00:35 IST|Sakshi
ఆవేదన.. ఆక్రోశం
 •  రోజురోజుకూ ఎక్కువవుతున్న కరెన్సీ కష్టాలు
 • బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు
 • ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ నిట్టూర్పు
 • నగదు లభ్యత అంతంత మాత్రమే
 • ‘అయ్యా..కాటికి కాళ్లు చాపుకున్న దాన్ని. అసలే నడవలేను. పింఛన్‌ డబ్బు కోసం రోజూ తిరుగుతున్నా. ఈరోజు పక్కింటి వారు రిక్షాలో ఇక్కడికి తీసుకొచ్చారు. మాలాంటి ముసలోళ్లకా ఈ కష్టాలు?! ఇన్ని అవస్థలు పడేదాని కంటే చావడమే మేలు..’- అనంతపురంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన లక్ష్మక్క ఆవేదన ఇది. ప్రజల కరెన్సీ కష్టాలకు ఆమె ఆవేదన అద్దం పడుతోంది. ఇలా ఎందరో వృద్ధులు, వికలాంగులు, రైతులు, సామాన్యులు నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. చేతిలో డబ్బులేక, బ్యాంకుల్లోనూ దొరక్క అవస్థ పడుతున్నారు. ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.

   

  అనంతపురం అర్బన్‌:

  పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రమూ తగ్గడం లేదు. మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు మంగళవారం తెరుచుకోవడంతో జిల్లా వ్యాప్తంగా జనం పోటెత్తారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి తదితర పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల వద్ద కూడా బారులు తీరారు. మరోవైపు ఏటీఎంల చుట్టూ జనం ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. తెరిచివున్న వాటి వద్ద చాంతాడంత క్యూలు కన్పించాయి. బ్యాంకుల్లో నగదు లభ్యత అంతంతమాత్రంగానే ఉంది. దీంతో కొన్ని బ్యాంకుల్లో రూ.3 వేలతోనే సరిపెట్టారు. జిల్లావ్యాప్తంగా  500లకు పైగా ఏటీఎంలు ఉంటే మంగళవారం 15లోపే పనిచేశాయి. అనంతపురం నగరంలోని సాయినగర్‌ రెండో క్రాస్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం ఒక్కటే పనిచేసింది. ఇక్కడే ఉన్న బ్యాంక్‌ వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచే ఖాతాదారులు భారీసంఖ్యలో బారులుతీరారు. జిల్లాలోని దాదాపు అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కన్పించింది. బ్యాంకులకు ఈ నెల 11న రూ.90 కోట్లు వచ్చింది. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నామని బ్యాంకర్లు తెలిపారు. వేతనాల సమయం కాబట్టి కనీసం రూ.200 కోట్లు వస్తేనే కొంత మేర ఉద్యోగులకు సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుందని ఓ బ్యాంక్‌ ఉన్నతాధికారి చెప్పారు. నగదు వస్తుందని చెబుతున్నారే తప్ప ఎంత మొత్తం, ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేదని బ్యాంకర్లు అంటున్నారు.

   

  చాలా ఇబ్బందిగా ఉంది  – రాజ్యలక్ష్మి, గృహిణి, ద్వారకా విలాస్, అనంతపురం

  డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజూ నేను, మా ఆయన వచ్చి బ్యాంక్‌ వద్ద గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోంది.  ఇంటి ఖర్చులకు కూడా కష్టంగా ఉంది. ఏటీఎంలో వచ్చే రూ.2 వేలు చాలడం లేదు. బ్యాంక్‌లోనూ, ఏటీఎంలోనూ విత్‌డ్రా మొత్తం పెంచాలి.

   

  నాలుగు రోజులుగా తిరుగుతున్నా : రసూల్‌బీ, విజయనగర్‌ కాలనీ, అనంతపురం

  వితంతు పింఛన్‌ డబ్బు కోసం వారం రోజులుగా బ్యాంక్‌ చుట్టూ తిరుగుతున్నా. మూడు రోజులుగా సెలవు ఉండడంతో ఈ రోజు ఉదయం ఆరు గంటలకే బ్యాంక్‌ వద్దకు వచ్చి కూర్చున్నా. టోకెన్‌ ఇచ్చి వెళ్లారు. వాళ్లు ఎప్పుడు పిలిచి డబ్బు ఇస్తారోనని ఎదురు చూస్తున్నా. మాలాంటి పేదలను కష్టపెట్టినోళ్లు ఎవరూ బాగుపడరు.

   

   

          

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా