అమ్మో కరెంట్‌!

22 Sep, 2016 18:15 IST|Sakshi
చీకోడు సబ్‌స్టేషన్‌
  • ఎప్పుడు పోతుందోనని నిత్యం భయం
  • ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దైన్యం
  • విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం
  • క్షేత్రస్థాయి సిబ్బందిలో నిండా నిర్లక్ష్యం
  • అధికారుల పర్యవేక్షణ కరువు
  • ఇబ్బందులు పడుతున్న జనం
  • దుబ్బాక: పాలకుల పట్టింపులేని తనం, విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని చీకోడు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో తరచుగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. గృహావసరాలకు సింగిల్‌ ఫేజ్‌ 24 గంటలు, రైతుల పొలాలకు త్రీ ఫేజ్‌ 9 గంటలపాటు నిరంతరాయంగా రెప్పపాటు కరెంట్‌ పొకుండా ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.

    క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపంతో అది అమలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్దేశమే నీరుగారిపోతోంది. క్షేత్రస్థాయి అధికారుల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చీకోడు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని కమ్మర్‌పల్లి, అచ్చుమాయపల్లి, పర్శరాంనగర్, ఆరెపల్లి, చీకోడు గ్రామాల్లో 15 రోజులుగా విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.

    వారం రోజుల్లోనే రెండు సార్లు 48 గంటల కరెంట్‌ సరఫరా బందైంది. సబ్‌ స్టేషన్‌లో మరమ్మతు పేరిట మరో నాలుగు రోజులు మధ్యాహ్నం సమయంలో కరెంట్‌ సరఫరా చేయలేదు. గ్రామాల్లో విద్యుత్‌ బోరుబావుల నుంచి సరఫరా అయ్యే నీటిపైనే ఆధారపడి తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వల్ల తాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు గోస చెప్పరానిది.

    స్నానాలకు నీరు లేక పాఠశాలలను మానేసి ఇంటి వద్దనే కూర్చుంటున్నారు. తాగునీరు లేక పాచి నీటినే వాడాల్సి వస్తోంది. రాత్రి పూట స్వైర విహారం చేసే దోమలతో ప్రజలు, చిన్నారులు సహవాసం చేయాల్సి వస్తోంది.  ఇన్‌కమింగ్‌ కరెంట్‌ రావడం లేదని, కురుస్తున్న వర్షాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారుల వాదన. కురుస్తున్న వర్షాలకు, వీస్తున్న గాలీకి పగటి పూట విద్యుత్‌ వైర్లు తెగిపోతే క్షేత్ర స్థాయి సిబ్బంది రాత్రి పూట వచ్చి తెగిన వైర్లు దొరకడం లేదని ఇంటి ముఖం పడుతున్నారు.

    పగటి సమయాల్లో అధికారులు అప్రమత్తం అయితే ప్రజలకు ఇబ్బంది కలిగేదు కాదు. కింది స్థాయి సిబ్బంది వల్లే రాత్రింబవళ్లు దోమలతో సహవాసం చేయాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్న విద్యుత్‌ వైర్లను సరిచేసి తాగు నీటి సరఫరాకు సహకరించాలని విద్యుత్‌ అధికారులకు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

    కరెంట్‌ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో..
    కరెంట్‌ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతోందో తెలియడం లేదు. అప్పుడొప్పుడొచ్చే వచ్చిరాని కరెంట్‌తోని తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పూట నిద్ర ఉండడం లేదు. తరచుగా ఇబ్బంది పెడుతున్న కరెంట్‌ సరఫరాపై విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. - బెస్త రాజయ్య, చీకోడు

    విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలి
    నెల రోజులుగా చీకోడు సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా కావడం లేదు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే  సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సబ్‌ స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తితే క్షేత్ర స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రజల విద్యుత్‌ కష్టాలను తొలగించి, విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలి. - ముత్యంపేట భాగ్యమ్మ, సర్పంచ్, కమ్మర్‌పల్లి

    తాగు నీటి సమస్య ఏర్పడుతోంది
    విద్యుత్‌ కోతలతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో బోరు బావుల నుంచి నీటి బొట్టు రావడం లేదు. తాగు నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. వాడకానికి ఒక్కోసారి వర్షపు నీళ్లే దిక్కవుతున్నాయి. విద్యుత్‌ సమస్యల్లేకుండా సరి చేయాలి. - తౌడ రేణుక, గృహిణి, చీకోడు

>
మరిన్ని వార్తలు