సైబరాబాద్‌లో సాఫీగా ప్రయాణం!

9 Oct, 2016 23:42 IST|Sakshi
సైబరాబాద్‌లో సాఫీగా ప్రయాణం!

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఏ చిన్న వర్షమొచ్చినా, ఎక్కడైనా వాహనం రోడ్డుపైనా నిలిచిపోయినా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతుండటంతో సిటీవాసులు గంటలకొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కూడా నానా తంటాలు పడాల్సి వస్తోంది.

సిబ్బంది కొరతతో కొన్నిసార్లు వలంటీర్ల సహాయం తీసుకుని వాహనాలు క్లియర్‌ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. వీటికితోడు వాహనాలు కూడా రోడ్డుపై ఎక్కడ ప్లేస్‌ ఉంటే అక్కడి నుంచి వెళుతుండటం కూడా ట్రాఫిక్‌ సమస్యకు మరో కారణంగా చెప్పొచ్చు. వీటన్నింటిపై అధ్యయనం చేసిన ట్రాఫిక్‌ పోలీసులు ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు బస్సు బేలు, ట్రాఫిక్‌ జంక్షన్లు, ఫ్రీలెఫ్ట్‌ల వద్ద బొల్లాడ్స్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే వీటి కోసం బడ్జెట్‌ లేకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఈ కాన్సెప్‌్టను సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ)కి వివరించడంతో వారు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాదాపు వెయ్యి బొల్లాడ్స్‌ ఇచ్చేందుకు ఆర్థిక సహాయం అందించారు.

 స్వచ్ఛందంగా ముందుకు..
అయితే ట్రాఫిక్‌ దిగ్భంధనం చేదించడంలో తమవంతు సహకారం అందిస్తామని బడా కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థలు ముందుకొస్తున్నాయి. బొల్లాడ్స్‌ను దాదాపు 1500 వరకు కొనుగోలు చేసి ఇచ్చేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలానే మిగతా కంపెనీలు కూడా ముందుకొస్తే ట్రాఫిక్‌ తిప్పలకు పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టవచ్చు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కూడా పూర్తిస్థాయిలో తమకు ఆర్థిక సహకారం అందిస్తే హైదరాబాద్‌లో మాదిరిగానే సైబరాబాద్‌లోనూ ట్రాఫిక్‌ కష్టాలను నియంత్రించవచ్చని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ అన్నారు.


అంతటా ట్రాఫిక్‌ తిప్పలే...
అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, మియాపూర్, రాజేంద్రనగర్, ఉప్పల్, వనస్థలిపురంతో పాటు ఐటీ కారిడార్‌లోని మదాపూర్, గచ్చిబౌలిలలో ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళలలో విపరీతమైన ట్రాఫిక్‌ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్రీ లెఫ్ట్‌ జంక్షన్లను ఏర్పాటుచేసి కొంతమేర ట్రాఫిక్‌ను నియంత్రించడంలో సక్సెస్‌ అయిన పోలీసులు...దానికి కొనసాగింపుగా వాహనాలు సరైన మార్గంలో ముందుకెళ్లేందుకు బొల్లాడ్స్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయా ప్రాంతాల్లోని బస్‌బేలు, ట్రాఫిక్‌ జంక్షన్లు, ఫ్రీ లెఫ్ట్‌ల వద్ద వీటిని క్యూలైన్లలో ఏర్పాటుచేస్తున్నారు. జంక్షన్ల వద్ద ఏర్పాటుచేసిన బొల్లాడ్స్‌ వల్ల ఎదురుగా వెళ్లే వాహనాలు, రైట్‌ టర్న్‌ తీసుకునే వాహనాలు సాఫీగా వెళ్లిపోతున్నాయి.

మరిన్ని వార్తలు