పెరగనున్న ఉపాధి వేతనం

23 Mar, 2017 18:52 IST|Sakshi
పెరగనున్న ఉపాధి వేతనం

వీరఘట్టం : ఉపాధి హామీ పనులకు సంబంధించి జీఓ15 ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఒక్కో వేతనదారుడికి గరిష్టంగా రూ.307 వేతనం వచ్చే అవకాశముందని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం వెల్లడించారు. వీరఘట్టం మండలం వండువ సమీపంలో జరుగుతున్న చెరువు పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి వేతనం 30 శాతం పెరగనున్నాయని చెప్పారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు నిర్వహించాలని సూచించారు.  విరామ సమయంలో వేతనదారులందరికీ మజ్జిగ అందజేయాలని సిబ్బందికి సూచించారు. కూలి డబ్బులను మద్యపానానికి వినియోగించకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తోటల్లో పంట సంజీవని కుంటలు తవ్వించాలని సూచించారు. అనంతరం వీరఘట్టంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు.  ఆయనతో పాటు ఏపీడీ లోకేష్, ఎంపీడీఓ శంకరరావు, ఏపీఓ జి.సత్యంనాయుడు, డిప్యూటీ తహసీల్దార్‌ బి.సుందరరావు, ఆర్‌ఐ రమేష్, మేజరు పంచాయతీ ఈఓ విశ్వనాథం తదితరులు ఉన్నారు.   

అయ్యవారు వస్తే అన్నీ హంగులే..
 ఇన్నాళ్లూ ఉపాధి పనుల వద్ద కనిపించని ప్రథమ చికిత్స కిట్టు కలెక్టర్‌ వస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. పనులు జరిగిన ప్రదేశంలో టెంట్లు వేయడంతో పాటు స్టీలు బిందెలతో తాగునీరు అందుబాటులో ఉంచారు. దీంతో ఉపాధి వేతనదారులు ముక్కున వేలేసుకున్నారు. ఇన్నాళ్లూ తాము ఎండలో మగ్గిపోతున్నా పట్టించుకోని సిబ్బంది అధికారులు వస్తున్నారని తెలిసి హడావుడి చేయడంపై విస్మయం చెందుతున్నారు. ఈ కిట్లు మిగతా రోజుల్లో ఏమవుతున్నాయనేదానికి అధికారుల వద్ద సమాధానం దొరకడం లేదు.

మరిన్ని వార్తలు