దళితులు సంఘటితం కావాలి

27 Aug, 2016 23:15 IST|Sakshi
దళితులు సంఘటితం కావాలి
 
ఆల్‌ ఇండియా దళిత్‌ రైట్స్‌ ఫెడరేషన్‌
ర్యాలీలో నాయకుల పిలుపు 
విజయవాడ(గాంధీనగర్‌):
బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని పలు దళిత సంఘాల నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ అనుబంధ సంఘాలు ప్రభుత్వ అండతో పేట్రేగిపోతున్నాయన్నారు. శనివారం ఆల్‌ ఇండియా దళిత్‌ రైట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో మహా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ పాత గవర్నమెంట్‌ హాస్పిటల్‌ నుంచి ఏలూరు లాకులు, న్యూఇండియా హోటల్‌æసెంటర్, లెనిన్‌ సెంటర్‌ మీదుగా ధర్నా చౌక్‌ వరకు కొనసాగింది. అనంతరం బహిరంగ సభలో ఫెడరేషన్‌ జాతీయ కన్వీనర్‌ కందుల ఆనందరావు మాట్లాడుతూ రోహిత్‌ కేసులో నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదన్నారు. గోవుల చర్మం వలిస్తే నేరంగా పరిగణించడం తగదన్నారు.. దళితులంతా ఒక్క రోజు పనిమానేస్తే మోడీ స్వచ్ఛభారత్‌ అడ్రస్‌ ఉండదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్‌ మాట్లాడుతూ దళితుల్లో ఇంకా చైతన్యం రావాలన్నారు. సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్‌ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు సైతం హత్యలకు గురవుతున్నారన్నారు. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సువర్ణలత, డీబీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్, మట్టా ఝాన్సీ, బుట్టి రాయప్ప, కేవీపీఎస్‌ నాయకులు నటరాజ్, పీ రాజేష్, కొండలరావు, కే సంజీవరావు, దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా