విగ్రహాల తొలగింపుపై ఆందోళన

22 Aug, 2017 23:01 IST|Sakshi
విగ్రహాల తొలగింపుపై ఆందోళన
జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించిన అధికారులు
దళిత సంఘాల నేతల నిరసన, ర్యాలీ
పంచాయతీ తీర్మానం ద్వారా సమస్య పరిష్కారానికి యత్నం
 
పెనుగొండ:
పెనుగొండ గాంధీ బొమ్మల సెంటర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాల తొలగింపుపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. కూడలిలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 14వ తేదీ రాత్రి విప్లవ వీరుడు భగత్‌సింగ్, 15వ తేదీన భారత రత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం మాజీ ఉపప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వరుసగా విగ్రహాలు వెలుస్తుండడంతో చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ నుంచి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు అందడంతో నిబంధనలు పాటించి విగ్రహాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ శాఖ, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా సోమవారం మూడు విగ్రహాలను తొలగించారు. దీంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మంగళవారం మహార్యాలీకి పిలుపు నిచ్చారు. జిల్లా  నలుమూలల నుంచి దళిత సంఘాల నాయకులు భారీగా తరలి వచ్చారు. ఉదయం 10 గంటలకు పెనుగొండ కళాశాల సెంటర్‌ నుంచి భారీగా ర్యాలీ నిర్వహించి, విగ్రహాలు తొలగించిన ప్రాంతంలో అరగంట పాటు బైఠాయించారు. విగ్రహాలు పునరుద్ధరించాలంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు సంయమనం పాటించారు. అనంతరం ర్యాలీగా పంచాయతీ వద్దకు వెళ్లి నినాదాలు చేసి, తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తహసీల్దారు బొడ్డు శ్రీనివాసరావును నిర్బంధించి, సమస్యను పరిష్కరించే వరకూ కదిలేది లేదంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాల నాయకులతో పోలీసులు చర్చలు నిర్వహించారు. చివరకు పంచాయతీ తీర్మానం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించి, పంచాయతీ అత్యవసర సమావేశం ద్వారా పునఃప్రతిష్ట చేయించాలని పట్టుబట్టడంతో తహసీల్దారు పంచాయతీకి విగ్రహల పునః ప్రతిష్టకు తగు చర్యలు తీసుకోవాలంటూ లేఖను అందించారు.
 
నేడు అత్యవసర సమావేశం
పంచాయతీలో చర్చించి తీర్మానించడానికిగాను బుధవారం పెనుగొండ పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్‌చార్జి కార్యదర్శి జీవీవీ సత్యనారాయణ తెలిపారు. తీర్మానం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో దళిత సంఘాల నాయకులు ఆందోళన విరమించి వెనుతిరిగారు. ఈ నిరసనలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, సమతా సైనిక్‌ దళ్‌ అధ్యక్షుడు డేవిడ్, బీజేపీ దళిత మోర్చా నాయకుడు కోరం ముసలయ్య, బీఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేన్, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం చంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పిడి మోషే, మాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తిర్రే రవి దేవాలు పాల్గొన్నారు.
 
తరలి రావాలి
బుధవారం పెనుగొండ పంచాయతీ వద్దకు ఉదయం 9 గంటలకు నియోజకవర్గంలోని దళితులందరూ తరలి రావాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం చంద్రరావులు పిలుపు నిచ్చారు. పంచాయతీ అత్యవసర సమావేశంలో విగ్రహాల పునఃప్రతిష్టకు తీర్మానం ఆమోదించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
 
 
 
మరిన్ని వార్తలు