సామూహిక అ‍త్యాచారం..లక్షకు బేరం!

25 Jul, 2016 08:28 IST|Sakshi
సామూహిక అ‍త్యాచారం..లక్షకు బేరం!

దళిత బాలికపై సామూహిక అత్యాచారం
చిత్తూరు (అర్బన్‌):
చిత్తూరు నగరంలో ఓ మైనర్‌ బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు. శనివారం జరిగిన ఈ సంఘటన బయటకు పొక్కనీయకుండా అత్యాచారం చేసిన వ్యక్తులు ఒక్కొక్కరు రూ.లక్ష పరిహారం చెల్లించాలని స్థానికంగా ఉన్న కొందరు పెద్ద మనుషులు ఆదివారం పంచాయతీలో తీర్మానం చేశారు. స్థానికుల కథనం మేరకు.. నగరంలోని ఇరువారం కాలనీ వద్ద 12 ఏళ్ల ఓ దళిత బాలికపై శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక ఏడుస్తూ వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

అప్పటికే కొందరు ఈ విషయాన్ని 100 నంబరుకు ఫోన్‌చేసి చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెలకట్టారు. అత్యాచారం చేసిన వ్యక్తులు రూ.లక్ష చొప్పున.. ఇద్దరు కలిసి రూ.2 లక్షలను బాధిత బాలిక కుటుంబానికి ఇవ్వాలని తీర్మానించారు. ఆలస్యంగా స్పందించిన టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. దీనిపై టూటౌన్‌ సీఐ వెంకటప్ప మాట్లాడుతూ.. ‘బాలికను ఈవ్‌టీజింగ్‌ చేసినట్టు మాకు ఫోన్‌ వచ్చింది. ఇప్పుడు అత్యాచారం అని చెబుతున్నారు. అందర్నీ విచారిస్తున్నాం. ఎక్కడైనా తప్పు జరిగినట్లు తెలిస్తే కేసు నమోదు చేస్తాం..’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు