బ్యారేజీ....డామేజీ....?

27 Jul, 2017 00:48 IST|Sakshi
బ్యారేజీ....డామేజీ....?
ధవళేశ్వరం ఆనకట్ట భద్రత గాలికి
నిషేధాజ్ఞలున్నా భారీ వాహనాల రాకపోకలు
చెక్‌ పోస్టులున్నా ’చెకింగ్‌’ శూన్యం
శ్లాబు పెచ్చులూడి గోతులు
ప్రశ్నార్ధకమవుతున్న బ్యారేజీ పటిష్టత
మర్మమతులు చేయని ప్రభుత్వం
 
 
1982
బ్యారేజీ కం బ్రిడ్జి ప్రారంభం
ధవళేశ్వరం వద్ద బ్యారేజీ కం బ్రిడ్జిని 1982 అక్టోబర్‌ 29న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. 1969లో దీని నిర్మాణ వ్యయం రూ.26.59 కోట్లు కాగా తర్వాత అది రూ.70 కోట్లకు పెరిగింది. బ్యారేజీ పనులు పూర్తయ్యే సమయానికి (ఆనకట్టతో కలుపుకుని) రూ.150 కోట్లకు చేరింది. 
 
500
పనిచేసిన ఇంజినీర్లు
ముంబాయికి చెందిన నేషనల్‌ ప్రాజెక్ట్సు కనస్ట్రక‌్షన్‌ కంపెనీ (ఎన్‌పీïసీసీ) ఆ«ధ్వర్యంలో నిర్మాణం జరిగింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ న్యూఢిల్లీ, సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌లు కన్సటెంట్స్‌గా వ్యవహరించాయి. అప్పట్లో ఐదువందల మంది ఇంజినీర్లు, 1,500 మంది టెక్నికల్‌ సిబ్బంది పనిచేశారు.
 
300 
వంతెనపై రోజుకు తిరిగే వాహనాలు 
 2001 నుంచి బ్యారేజీ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల రాకపోకలు నియంత్రించారు. ప్రస్తుతం కార్లు, బస్సులు, ఇతర మినీ వాహనాలు రోజుకు సుమారు మూడు వందల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి.
 
10.13 లక్షలు
ఆయకట్టు ఎకరాలలో
భారీ వాహనాల రాకపోకల పూర్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే బ్యారేజీ బేరింగ్స్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బ్యారేజీ భద్రత ఎంతో ముఖ్యం. ప్రభుత్వం దీనిపై  శ్రద్ధ చూపకపోతే జాతీయ కట్టడం శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది.
 
కొవ్వూరు: 
ఉభయ గోదావరి జిల్లాలకు తలమానికంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆనకట్టను స్వాతంత్య్రానికి పూర్వమే నిర్మించిన విషయం తెలిసిందే. ఆనకట్టను అనుకుని 1982లో బ్యారేజీ కం బ్రిడ్జిని నిర్మించారు. దశాబ్దాలుగా సేవలందిçస్తున్న ఈ వారధిపై భారీ వాహనాల రాకపోకలకు నిషేధాజ్ఞలు ఉన్నా ఆచరణకు నోచుకోవడం లేదు. 2001లో ఈ బ్యారేజ్‌ను సందర్శించిన నిపుణుల కమిటీ ఇది అత్యంత ప్రమాదకరంగా ఉందని నిర్ధారించింది. కాంక్రీట్‌ నిర్మాణం కూడా పలుచోట్ల పెచ్చులు ఊడుతున్నట్టు గుర్తించారు. దాంతో ఈ బ్యారేజీపై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. నీటిపారుదల శాఖ అధికారులు ఆనకట్టకు రెండు వైపులా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని కాపలా పెట్టారు. అయితే సిబ్బంది చేతివాటంతో రాత్రి పూట భారీ వాహనాలు గుట్టుచప్పుడు కాకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల ధవళేశ్వరం వైపు అధిక సంఖ్యలో వెళుతున్న భారీ వాహనాలను గుర్తించి మద్దూరులంక గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో బండారం బయట పడింది. బ్యారేజీపై పదిటన్నుల సామర్ధ్యం మించిన వాహనాలకు అనుమతి లేదు. అయినప్పటికీ కొందరు అధికారులు, సిబ్బంది సహకారంతో యాభై, ఆరవై టన్నుల సామర్ధ్యం కలిగిన భారీ వాహనాలు పట్టపగలు వెళుతుండడాన్ని గుర్తించి స్ధానికులు అడ్డుకున్నారు. నీటి పారుదలశాఖ పనులు నిమిత్తం వస్తున్న లారీలు కావడంతో అనుమతించినట్టు అధికారులు సమర్ధించుకుంటున్నారు. నిడదవోలుకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన భారీ వాహనాలు బ్యారేజీపై నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం. కాకినాడ నుంచి వచ్చే వారి వాహనాలకు ఈ మార్గం దగ్గరగా ఉండడంతో అధికారులను బెదిరించి మరీ రాకపోకలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. 
 
మరమ్మతులకు నోచుకోని బ్యారేజీ:
సీతంపేట నుంచి ధవళేశ్వరం వరకు ఎనిమిది కిలో మీటర్లు దూరం ఏర్పాటు చేసిన రోడ్డు పలు చోట్ల దెబ్బతింది. 3.5 కిలో మీటర్లు పొడవున నాలుగు అంచెలుగా బ్యారేజి మీదుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాటు చేíసిన రహదారి భారీ వాహనాలతో దెబ్బతింతోంది. రెండేళ్ల కిత్రం పుష్కరాల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న బ్యారేజీపై రోడ్డును పునర్‌ నిర్మాణం చేశారు. ప్రస్తుతం పలుచోట్ల శ్లాబు పెచ్చులూడి గోతులు పడుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో ఈ గోతులు మరింత పెద్దవి కావడమే కాకుండా బ్యారేజీ పటిష్టత దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతోంది. 
 
ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు:
భారీ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. బ్యారేజీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏడాదిపాటు పనిచేసే ఒప్పందంతో ప్రయివేటు సెక్యూరిటీని నియమించాం. ఆనకట్టకు ఇరువైపులా చెక్‌పోస్టులు నిర్వహిస్తాం. ఆగష్టు మొదటి వారం నుంచి ప్రయివేటు సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుంది. బ్యారేజీ రోడ్డు దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేయిస్తాం. పలు చోట్ల మరమ్మతులతో పాటు కాంక్రీటు వేయాల్సి ఉంది. దీనికి రూ.4 లక్షలు కేటాయించాం.
ఎన్‌.కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్స్,ధవళేశ్వరం
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు