కొట్టుకుపోయిన వంతెన హామీ

20 Aug, 2016 18:41 IST|Sakshi
కొత్తవలస డ్యామ్‌పై నీటిలోంచి చంటిపిల్లతో నడుస్తున్న మహిళ
కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర ప్రయాణాలు
నీటిమట్టం పెరిగితే ప్రాణాలకే ముప్పు
వర్షాకాలంలో అయిదు గ్రామాల ప్రజల అవస్థలు
కార్యరూపం దాల్చని వంతెన నిర్మాణం హామీ
 
 
 
సీతానగరం: ప్రాణాలరచేతిలో పెట్టుకుని నీటిలోకి దిగాలి. ప్రవాహంలోంచి బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగాలి. అయిదు గ్రామాల ప్రజల అవస్థలివి. సువర్ణముఖి నదిపై నిర్మించిన కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర పరిస్థితులివి. సువర్ణముఖి నదిపై కొత్తవలస వద్ద సీతానగరం సాగునీటి ప్రాజెక్ట్‌ను నిర్మించారు. కొత్తవలస, వీబీ పురం, వీరభద్రపురం, అంటివలస, బందొరవలస తదితర గ్రామాల ప్రజల వ్యవసాయ పనులకు, మూడు మండలాల ప్రయాణికులకు ఇదే రహదారి కావడంతో నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో డ్యామ్‌పై నుంచి నీరు ప్రవహించేటప్పుడు, అకస్మాత్తుగా నీరు ఎగువ నుంచి విడుదలైనప్పుడు ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నీటి ప్రవాహంలోంచి వచ్చే పాదచారులు, వాహన చోదకులు 50 మీటర్ల లోతులోని నదిలో పడి మత్యువాత పడిన సందర్భాలున్నాయని స్థానికులు తెలిపారు.  ఏటా వర్షాకాలంలో లెక్కలేనన్ని పశువులు కూడా నదిలో పడి మతి చెందుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మక్కువ మండంలం వెంకటభైరిపురం–డి.శిర్లాం గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై వంతెన నిర్మించాలని అప్పటిమంత్రులు బి.సత్యనారాయణ, ఎస్‌.విజయ రామరాజు నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు సర్వే నిర్వహించి నదిలో బోర్లు వేయించారు. అనంతరం ఆ విషయం మరుగున పడింది.
 
వర్షాకాలంలో నరకయాతన: వై.వాసుదేవరావు, కొత్తవలస
 
వర్షాకాలం వస్తే పనులు, నిత్యావసర సరుకుల కోసం బయటికెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నాం. డి.శిర్లాం– వెంకట భైరిపురం గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ప్రమాదాల నివారణకు సత్వరమే చర్యలు తీసుకోవాలి.   
 
కొత్తవలస డ్యామ్‌పై ఏటా ప్రమాదాలు: సిహెచ్‌.దొర, కొత్తవలస
 
వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. కొత్తవలస డ్యామ్‌ వద్ద ఏటా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు తక్షణమే వంతెన నిర్మించాలి.
 
 
 
మరిన్ని వార్తలు