కృష్ణాలో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా

11 Aug, 2016 16:23 IST|Sakshi
ఈ-కోలి బ్యాక్టీరియాను గుర్తించిన గుంటూరు జిల్లాలోని సీతానగరం ఘాట్‌

చర్మ రోగాలు వచ్చే ప్రమాదం
తాగితే డయేరియా, విరోచనాలు,టైఫాయిడ్, కామెర్ల ముప్పు
హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
కృష్ణాలో కలుస్తున్న మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు
ప్రభుత్వం తక్షణం చర్యలు చేపడితేనే పుష్కర భక్తులకు భరోసా

 
సాక్షి, హైదరాబాద్/గుంటూరు: పవిత్ర కృష్ణా పుష్కరాలు మరో 24 గంటల్లో ప్రారంభం కానున్నాయి. పిల్లాపాపలతో సహా తరలివచ్చేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 లక్షల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఈ లెక్కన 12 రోజుల్లో 1.20 కోట్ల మందికి పైగా జనం పుష్కర స్నానాలు చేయనున్నారు. కృష్ణా నది ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే... పుష్కర స్నానం తో ప్రాణాంతక రోగాలు పక్కా అని చెప్పక తప్పదు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు నేరుగా కలుస్తుండటంతో జీవనది కృష్ణమ్మ కాలుష్య కాసారంగా మారింది.
 
కృష్ణా నీటిలో అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా స్థావరం ఏర్పరచుకున్నట్లు తేలింది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీటిని తాగితే డయేరియా, రక్తపు విరోచనాలు, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు, రకరకాల ఉదరకోశ జబ్బులతోపాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బ్యాక్టీరియా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
 
 మోగుతున్న ప్రమాద ఘంటికలు
 పుష్కర ఏర్పాట్లలో నిమగ్నమైన ప్రభుత్వ అధికారులకు అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా నిద్ర లేకుండా చేస్తోంది. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో ఈబ్యాక్టీరియా తీవ్రస్థాయిలో ఉన్నట్లు గత నెల 30న వైద్య నిపుణులు గుర్తించారు. కృష్ణా నదిలో నీరు ఎప్పటి నుంచో నిల్వ ఉండడం, ఘాట్ నిర్మాణ పనుల్లో భాగంగా వ్యర్థాలను నీటిలో పడేయడంతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు  భావిస్తున్నారు. కర్నూలులోని మురుగు నీరు, అక్కడి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయనాలతో కూడిన నీరు తుంగభద్ర నది గుండా కృష్ణాలోకి ప్రవేశిస్తోంది. విజయవాడ ఎగువన కాగిత పరిశ్రమల నుంచి రసాయనాలు కృష్ణాలో కలుస్తున్నాయి. గొల్లపూడి ప్రాంతంలోని కాలనీల నుంచి మురుగు నీరంతా నదిలోకి చేరుతోంది. విష రసాయనాలు, డ్రైనేజీ నీరు కలవడం వల్ల కృష్ణా నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా మోతాదుకు మించి ఉంది.  
 
 14 ఐపీఎం బృందాల పర్యవేక్షణ
 గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా నదిలో ఈ-కోలి బ్యాక్టీరియాని గుర్తించడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఘాట్‌ల వద్ద నీటి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించేందుకు ఐపీఎం సిబ్బంది 14 బృందాలుగా ఏర్పడ్డారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడలోని దుర్గ గుడి పక్కన ఉన్న వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో వాటర్ మానిటరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో అన్ని పుష్కర ఘాట్‌ల వద్ద నీటి నమూనాలు సేకరించి, పరీక్షలు జరపనున్నారు.
 
 ప్రభుత్వం ఏం చేయాలి?
 ♦   ఈ-కోలి బ్యాక్టీరియా తీవ్రత తక్కువగా ఉన్న ఘాట్లను గుర్తించి, జనం అక్కడ స్నానాలు ఆచరించేలా ప్రోత్సహించాలి.
 ♦    పుష్కరాలు ముగిసేలోగా మురుగు నీరు కృష్ణాలో కలవకుండా చూడాలి.
♦    బ్యాక్టీరియా బారిన పడి అస్వస్థతకు గుర య్యే వారికి వెంటనే వైద్య సేవలందించేం దుకు సిబ్బందిని సర్వసన్నద్ధంగా ఉంచాలి.
♦    పుష్కర స్నానాల్లో శాంపూలు, సబ్బుల వాడకంపై నిషేధం ఉంది. అయినా ఇది ఎక్కడా అమలు కాకపోవడం గమనార్హం. కృష్ణా పుష్కరాల్లో శాంపూలు, సబ్సులున పకడ్బందీగా నియంత్రించాలి.
♦   పుష్కర ఘాట్‌ల వద్ద పోగయ్యే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
♦    ఘాట్‌ల వద్ద గంటగంటకూ క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలి.  
♦    ఏపీలో 50 మైక్రాన్ల లోపు పాలిథిన్ కవర్లపై నిషేధం ఉన్నా ఇది కాగితాలకే పరిమితమైంది. కనీసం పుష్కరాల సమయంలో అయినా పాలిథిన్ కవర్లు, ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులను నిషేధించాలి.
 
 కాలుష్యం ప్రమాదకర స్థాయిలో లేదు
‘‘ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు కృష్ణా నది నీటిని పరీక్షించి ల్యాబ్ రిపోర్టులను కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు, మున్సిపాలిటీలకు అందజేస్తున్నాం. నీరు కొంత మేరకు కలుషితమైన విషయం వాస్తవమే గానీ, అదేమీ ప్రమాదకర స్థాయిలో లేదు. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లోరినేషన్ పెంచాలని సూచించాం. పుష్కరాల రోజు నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి నీటి పరీక్షలు నిర్వహించి, తదగుణంగా క్లోరినేషన్ ప్రక్రియ చేయాలని ఆదేశించాం’’ అని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు