ప్రధాన వాణిజ్య పంట

21 Oct, 2016 23:03 IST|Sakshi
ప్రధాన వాణిజ్య పంట

అనంతపురం అగ్రికల్చర్‌ : ఇటీవల దానిమ్మ తోటలు జిల్లాలో ప్రధాన వాణిజ్యపంటగా రైతులను ఆర్థికంగా గట్టెక్కిస్తున్నాయని ఉద్యానశాఖ టెక్నికల్‌ హెచ్‌వో జి.చంద్రశేఖర్‌ తెలిపారు. అయితే కొందరు సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు  చేపట్టకపోవడంతో నష్టపోతున్నారు.  ప్రధానంగా  తోటలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే తెగుళ్లు, రోగాలను అంత దూరం చేసుకోవచ్చని తెలిపారు.  

దానిమ్మకు అనుకూలం..
భూభౌగోళిక నైసర్గిక పరంగా జిల్లాలో అన్ని రకాల నేలలు దానిమ్మ తోటలకు అనుకూలం. గణేష్, మదుల, భగువ రకాలు ఎంచుకోవాలి. నాటే సమయంలో 20 కిలోల పశువుల ఎరువు, కిలో సూపర్‌ ఫాస్ఫేట్, 2 శాతం లిండేన్‌ పొడిని మట్టితో కలిపి గుంతలు నింపాలి. గాలి అంట్లు, నేల అంట్లు లేదా కొమ్మల ప్రవర్ధనం ద్వారా వచ్చిన మొక్కలను నాటుకోవాలి.  50–70 రోజుల్లో అంట్లు  వేర్లు నాటేందుకు అనుకూలం. చెట్టు వయస్సును బట్టి పశువుల ఎరువు, వేపపిండి, నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులు వాడాలి.  

సూక్ష్మధాతు లోపాల సవరణ..
జింకు లోపం ఏర్పడితే ఆకుల పరిమాణం చిన్నదిగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. లీటరు నీటికి 5 గ్రాముల జింకు సల్ఫేటును కలిపి 1–2 సార్లు కొత్త చిగురు ఉన్నప్పుడు పిచికారి చేయాలి. పెర్రస్‌(ఇనుము) ధాతువు లోపించిన ఆకులు తెల్లబడతాయి. నివారణకు  2.5 గ్రాముల పెర్రస్‌ సల్ఫేట్‌ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్నా... బోరాన్‌ లోపించనపుడు లేత కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి.  నివారణకు 12.5 గ్రాముల బోరాక్సును పాదులకు వేయాలి. లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్సును కలిపి పిచికారి చేయాలి. ప్రతి మొక్కకు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగిలినవి కత్తిరించాలి. నేలకు తగిలే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నీటి కొమ్మలను కత్తిరించాలి. డ్రిప్‌ ద్వారా నీటి సదుపాయం క్రమపద్ధతిలో ఇవ్వాలి. కాయతొలిచే పురుగు, బెరడు తినే పురుగులు, తామరపురుగులు, పేనుబంక నివారణ చర్యలు చేపట్టాలి.

మచ్చ తెగులు ప్రమాదకరం:
 బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే మచ్చతెగులు 27 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత, 70 శాతం పైగా గాలిలో తేమశాతం ఉండే జూలై నుంచి అక్టోబర్‌ వరకు ఎక్కువగా కనిపిస్తుంది. వేసవిలో కురిసే వర్షాల వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితులు కూడా ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన చెట్లకు అంట్లు కట్టుట వలన నర్సీరీ దశలోనే వ్యాప్తి చెందుతుంది. ఆకులపైన, కొమ్మలపైన, పిందెలపైన నీటిలో తడిచిన మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు అధికమై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు రాలిపోవడం, కొమ్మలు కణుపుల వద్ద విరిగిపోవడం, కాయలపై మచ్చలు నలుపు రంగులోకి మారి వాటిపై ‘వై’ లేదా ఎల్‌’ ఆకారపు నెరియలు ఏర్పడుతాయి. మొదట్లోనే రోగరహిత మొక్కలు నాటుకోవాలి.  తెగులు ఆశించిన కొమ్మల భాగాలను అంగుళం కింది వరకు కత్తిరించి కాల్చి వేయాలి. కత్తిరింపు సమయంలో వాడే కత్తెరలను ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి ఉపయోగించాలి. వీటి కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలి. కత్తిరింపులు అయిన వెంటనే ఒక శాతం బోర్డో మిశ్రమమును పిచికారి చేసుకోవాలి.

మరిన్ని వార్తలు