అమ్మా.. నిన్నొక్కసారి చూడాలమ్మా..

18 Jun, 2016 10:59 IST|Sakshi
అమ్మా.. నిన్నొక్కసారి చూడాలమ్మా..
  • కిడ్నాపైన తల్లి కోసం చిన్నారుల ఎదురు చూపు
  • సుమారు ఆరు నెలలుగా కంటికి కనిపించని తల్లి
  • కిడ్నాపైందంటే అదృశ్యం కేసు నమోదు చేసిన ఖాకీలు
  • నిందితులు కళ్లెదుటే తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు
  • అన్ని కేసుల్లోలా ఈ కేసులోనూ చక్రం తిప్పుతున్న టీడీపీ నేతలు
  • చివరకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన బంధువులు
  •  
     
    ఒంగోలు : ఆరు నెలలుగా తల్లి కనిపించకపోవడంతో ఇద్దరు చిన్నారులు నరకయూతన అనుభవిస్తున్నారు. తల్లి ప్రేమ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్రామానికి చెందిన యువకులే ఆమెను కిడ్నాప్ చేశారని తెలిసినా చివరకు పోలీసులు సైతం సీరియస్‌గా పట్టించుకోకపోవడం బాధితురాలి కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన మిగిల్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా శింగరపల్లెకు చెందిన దార్ల ఆదిలక్ష్మి, వెంకటరమణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జయశ్రీ (7), స్వాతి (5). కుటుంబ పోషణ కోసం భర్త వెంకట రమణ చెన్నైలోని ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు.
     
     ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మురారి కృష్ణ, దాసరి అడవిరాజు కన్ను ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మిపై పడ్డాయి. ఆమెను నిత్యం లైంగికంగా వేధించారు. చివరకు ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఆదిలక్ష్మితో పాటు ఆమె ఇద్దరు పిల్లలను ఆటోలో గిద్దలూరు రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రైలులో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి ఉప్పల్‌లోని గాంధీ బొమ్మ సెంటర్‌లో అడవిరాజు తల్లి వెంకట లక్ష్మమ్మ, అన్న వెంకటరావు ఇంట్లో తల్లీబిడ్డలను బంధించారు.
     
     అప్పటికే తల్లి మాయం
     విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఉప్పల్ వెళ్లి వెంకటరావు ఇంట్లో వెతికారు. అప్పటికే తల్లిని మాయం చేసి పిల్లలను మాత్రమే అక్కడ ఉంచారు. పిల్లలను అక్కును చేర్చుకుని ఆ ఇంట్లో ఉన్న దాసరి వెంకటరావు, వెంకట లక్ష్మమ్మలను నిలదీశారు. ఆదిలక్ష్మి ఆచూకీ చెప్పకపోవడంతో వారిద్దరిని బేస్తవారిపేట పోలీసులకు అప్పగించి జరిగిన విషయం చెప్పారు. నిందితులపై కిడ్నాప్ కేసు పెట్టారు.
     
    చక్రం తిప్పిన తమ్ముళ్లు
    విషయం తెలిసి టీడీపీ నేతలు సీన్‌లోకి వచ్చారు. ఆదిలక్ష్మి కిడ్నాప్‌నకు వినియోగించిన ఆటో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిది కావడం.. ఆటో నడిపిన మురారి కృష్ణ బంధువు కావడంతో కేసును విచారించేందుకు పోలీసులు కాస్త వెనకడుగు వేశారు. బాధితులు పలుసార్లు పోలీసుస్టేషన్ మెట్లెక్కినా కిడ్నాప్ కేసు నమోదు చేయలేదు. కేసును నిర్వీర్యం చేసేందుకు కిడ్నాప్ కేసును కాస్త అదృశ్యం కేసుగా మార్చి ఖాకీలు చేతులు దులుపుకున్నారు.
     
    ఫిబ్రవరి 2వ తేదీన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆదిలక్ష్మి ఆచూకీపై పోలీసులు అప్పటికీ శ్రద్ధ తీసుకోలేదు. అప్పటికే పోలీసుల అదుపులో ఉన్న అడవిరాజు తల్లి, అన్నను వదిలేశారు. పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరగా వెంకటరమణ కోర్టు తలుపు తట్టాడు. తన భార్యను కిడ్నాప్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
     
    అడవిరాజు కుటుంబానిది బ్రోతల్ వ్యాపారం
    అడవిరాజు కుటుంబం పదిహేనుళ్లుగా హైదరాబాద్‌లో ఉంటోంది. అతడి అన్న బ్రోతల్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్ పోలీసుస్టేషన్‌లో కేసులు కూడా ఉన్నారుు. నా తమ్ముని భార్యను బ్రోతల్ కేంద్రానికి అమ్మేశారా, లేక చంపారోనని  అనుమానంగా ఉంది. అమ్మ కోసం పిల్లలు ఏడ్వని రోజు లేదు.
     - దార్ల వెంకటేశ్వర్లు, చిన్నారుల పెదనాన్న
     
    ఫిర్యాదు ప్రకారమే కేసు విచారించాం
    ఆదిలక్ష్మి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. అడవిరాజు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు అందుబాటులోకి రావడం లేదు. అడవిరాజు తల్లి, అన్నను విచారించినా ఫలితం లేకపోవడంతో వారిని వదిలేశాం.
     - రామానాయక్, ఎస్సై, బేస్తవారిపేట

మరిన్ని వార్తలు