'టిఫిన్ పెట్టలేదని కోడల్ని చంపేశాడు'

21 May, 2016 16:51 IST|Sakshi
'టిఫిన్ పెట్టలేదని కోడల్ని చంపేశాడు'

విజయవాడ రూరల్: కొడుకు ప్రేమించి పెళ్లాడిన యువతిని..తండ్రిలా ఆదరించాల్సిన మామే దారుణంగా హత్య చేశాడు. విజయవాడ రూరల్ మండలం నున్నలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ప్రకారం. స్థానికంగా ఉండే జూలిపూడి సత్యనారాయణ కుమారుడు శివాజీ పెట్రోల్ బంక్‌లో పని చేస్తాడు. పది రోజుల క్రితమే సుమతి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ కొడుకు ప్రేమ వివాహం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేనట్టు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఉదయం శివాజీ పెట్రోల్ బంక్‌ కు  విధులకు వెళ్లగా... సుమతి స్థానికంగానే ఉన్న ఆడపడచు ఇంటికి వెళ్లింది.

కొద్ది సేపటి తర్వాత ఇంటికి తిరిగివచ్చిన సుమతిపై సత్యనారాయణ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు . టిఫిన్ పెట్టకుండా పెత్తనాలు చేయడానికి వెళ్లావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలోనే  తలుపు గడియ వేసి, టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి సుమతి చున్నీతో ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ఏమీ ఎరుగని వాడిలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కోడలు చనిపోయిందని చెప్పి పోలీసులను తీసుకొచ్చాడు. అయితే పోలీసుల విచారణలో అతడే హత్య చేసినట్టు తేలడంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ శ్రావణి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు