రోడ్డెక్కిన డాక్టర్లు

27 Sep, 2016 00:12 IST|Sakshi
రోడ్డెక్కిన డాక్టర్లు
  • డీసీహెచ్‌ఎస్‌పై దాడికి నిరసనగా ఆందోళనలు
  • జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌
  • మద్దతుగా నిలిచిన జిల్లా అధికారుల సంఘం
  • అనంతపురం మెడికల్‌ : నాడి పట్టాల్సిన వైద్యులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. కదిరి ఏరియా ఆస్పత్రి వద్ద జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ రమేష్‌నాథ్‌పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది ఏకమై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. వీరికి జిల్లా అధికారుల సంఘం నేతలు మద్దతు తెలిపారు. సోమవారం ఉదయాన్నే అనంతపురం సర్వజనాస్పత్రి వద్దకు చేరుకున్న డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌  క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని బైఠాయించారు. దీంతో కలెక్టర్‌ కోన శశిధర్‌ వారిని లోపలికి పిలిపించి మాట్లాడారు. ఇలా వైద్యులపై దాడి చేయడం ఏంటని..? పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ఎలా విధులు నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఎంత ఒత్తిడి ఉన్నా విధులను సమర్థవంతంగా చేపడుతున్నామని, ఇలాంటి చర్యల వల్ల విధులకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందన్నారు. తక్షణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో కలెక్టర్‌ మాట్లాడుతూ, ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఈ అంశాన్ని తనకు వదిలేయాలని, బాధ్యులపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక రెవెన్యూ భవన్‌లో జరిగిన ‘మీ కోసం’కు వచ్చిన అధికారులు కూడా దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కలెక్టరేట్‌ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏదైనా ఉంటే అధికారులకు విన్నవించాలే గానీ ఇలా దాడులు చేస్తే ఎలాగని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. కార్యక్రమాల్లో  ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ యుగంధర్, ఆస్పత్రి యూనిట్‌ అధ్యక్షులు డాక్టర్‌ రామస్వామి నాయక్, కార్యదర్శి డాక్టర్‌ వీరభద్రయ్య, నర్సింగ్‌ సంఘం అధ్యక్షురాలు సావిత్రి, ఐఎంఏ అధ్యక్షులు కొండయ్య, కార్యదర్శి వినయ్, డాక్టర్లు జగన్మోహన్‌రెడ్డి, ఆదిశేషు, ప్రవీణ్‌దీన్‌కుమార్, యండ్లూరి ప్రభాకర్, కన్నేగంటి భాస్కర్, రాంకిషోర్, విజయమ్మ, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరి దేవి, డీఎఫ్‌ఓ రాఘవయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, సెరికల్చర్‌ ఏడీ అరుణకుమారి, మార్కెటింగ్‌ శాఖ ఏడీ హరిలీల, ఎస్‌ఎస్‌ఏ పీఓ దశరథరామయ్య, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, చేనేత జౌళీ శాఖ ఏడీ పవన్‌కుమార్, ఉద్యాన శాఖ డీడీ సుబ్బరాయుడు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రమాభార్గవి, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ రోశన్న, డ్వామా పీడీ నాగభూషణం, డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామనాయక్, జేడీఏ శ్రీరామ్మూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ జయకుమార్, డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్, కార్మిక శాఖ అధికారి రాణి, మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ వెంకటేశ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

    జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

    డాక్టర్‌ రమేష్‌నాథ్‌పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. గుంతకల్లులో వైద్యులు రోడ్డుమీదకొచ్చి ఆందోళన చేశారు. హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. గుంతకల్లులో బీజేపీ నాయకులు ఎస్‌ఐకు వినతిపత్రం అందజేశారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్జీఓ ఉద్యోగులు, వైద్య సిబ్బంది ర్యాలీలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కళ్యాణదుర్గంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మడకశిరలో ర్యాలీ చేశారు. పెనుకొండలో ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గోరంట్ల, గుత్తి, కణేకల్లు, ఆత్మకూరులో ఆందోళనలు నిర్వహించారు. రాయదుర్గంలో విధులు బహిష్కరించారు. శింగనమల, గార్లదిన్నె సీహెచ్‌సీల వద్ద ధర్నా చేశారు. కూడేరు, ఉరవకొండలో విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు.

     

     

మరిన్ని వార్తలు