వైద్య కళాశాలకు పార్థివ దేహం వితరణ

23 Jan, 2017 22:27 IST|Sakshi
రాజానగరం :
పశ్చిమ గోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, త్యాజంపూడికి చెందిన ఏలేటి రామారావు (69) పార్థివ దేహాన్ని ఆయన కుమార్తెలు అరుణ, కల్పన స్థానిక జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలకు వితరణగా అందజేశారు. సోమవారం మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైవీ శర్మను కలుసుకుని తన తండ్రి పార్థీవ శరీరంతోపాటు దానపత్రాన్ని అందజేశారు. గుండెపోటుతో ఆదివారం తన స్వగృహంలోనే ఆయన మరణించారన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామారావు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో అభ్యుదయ వాదిగా మారి, వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు సాంస్కృతిక రంగాన్ని వేదికగా చేసుకున్నారు. నాటక రచయితగా, దర్శకుడిగా అనేక ప్రదర్శనలిచ్చారు. ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు, ఇల్లాలు, అమ్మోరు తదితర సినీమాలకు సహాయ దర్శకుడిగా చేస్తూ పలు సినీమాలకు సంభాషణలు రాశారు. మరణానంతరం తన శరీరం వైద్య విద్యార్థుల పరిశీలనకు ఉపయోగపడాలనే ఆయన ఆశయం మేరకు పార్థివ దేహాన్ని న్ని వైద్య కళాశాలకు అందజేశామని రామారావు కుమార్తెలు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు