బిల్లు కట్టలేదని... మార్చురీలోనే మృతదేహం

22 Dec, 2015 00:51 IST|Sakshi
బిల్లు కట్టలేదని... మార్చురీలోనే మృతదేహం

భర్త శవం కోసం భార్య పడిగాపులు
♦ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు
♦ హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో శవాన్ని అప్పగించిన ఆస్పత్రి వర్గాలు
♦ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని ఆదేశం
♦ ఆరోపణలను ఖండించిన ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి
 
 సాక్షి. హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల అమానవీయ చర్యలకు ఇదో నిదర్శనం. వైద్య ఖర్చులు చెల్లించలేదనే సాకుతో చనిపోయిన వ్యక్తి శవాన్ని అప్పగించకుండా గత నాలుగు రోజుల నుంచి ఆస్పత్రి అధీనంలోనే పెట్టుకున్న వైనం ఇది. బాధితుని భార్య రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో చివరకు ఆమె భర్త మృత దేహాన్ని అప్పగించారు.

 చికిత్స పొందుతూ నెల రోజుల తర్వాత మృతి
 పశ్చిమబెంగాల్‌కు చెందిన జ్యోతిప్రకాష్ దూబే గత కొంత కాలంగా ప్రాంక్రియాస్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం నవంబర్ 11న ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ప్రాంకీయాస్ పూర్తిగా పాడైనట్లు గుర్తించిన వైద్యులు బాధితునికి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. నెల రోజులుగా  ఆస్పత్రిలోనే ఉన్న దూబే డిసెంబర్ 18న రాత్రి చనిపోయారు. ఆస్పత్రిలో మార్చురీ లేక పోవడంతో అదే రోజు రాత్రి శవాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కాగాఇప్పటి వరకు అతని చికిత్స కోసం ఆస్పత్రి వైద్య ఖర్చులు రూ.7.50 లక్షల బిల్లు కాగా, అందులో రూ.5 లక్షలు చెల్లించినట్లు, మిగిలిన మొత్తం రూ.2.50 లక్షలు చెల్లించలేని స్థితిలో ఉన్నానని, తన భర్త శవాన్ని అప్పగించాలని  మృతుని భార్య మౌమిత దూబే ఆస్పత్రి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

అయినా ఆస్పత్రి యాజమాన్యం కనికరం చూపలేదు. బిల్లు మొత్తం చెల్లిస్తేనే భర్త శవాన్ని, పోస్టుమార్టం రిపోర్టును అప్పగిస్తామని స్పష్టం చేసింది. దీంతో బాధితురాలు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే శవాన్ని ఆమెకు అప్పగించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది.

 చనిపోయిన వెంటనే శవాన్ని అప్పగించాం..
 ‘ఆస్పత్రికి వచ్చే సమయానికే జ్యోతిప్రకాష్ దూబే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స చేసినా బతకడం కష్టమని అప్పుడే చెప్పాం. మానవతా దృష్టితో ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స కూడా చేశాం. నెల రోజుల నుంచి ఆస్పత్రిలోనే  ఉండి, అతను శుక్రవారం రాత్రి చనిపోయాడు. అప్పటికే రూ.7.50 లక్షలు బిల్లు అయింది. అందులో రూ.5 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తం తెల్లవారాక చెల్లిస్తానని మౌమిత స్వయంగా చెప్పారు. ఆమె కోరిక మేరకు అదే రోజు రాత్రి నిమ్స్ మార్చురికి శవాన్ని తరలించి అక్కడ భద్రపరిచాం. ఆ తర్వాత ఆమెను బిల్లు కూడా అడగలేదు. శవాన్ని అప్పగించలేదనే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు’ అని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి ప్రజా సంబంధాల విభాగం ఇన్‌చార్జి సత్యనారాయణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు