పసి ప్రాణం ఖరీదు 5 లక్షలు!

10 Jun, 2016 06:38 IST|Sakshi
పసి ప్రాణం ఖరీదు 5 లక్షలు!

వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి
మృతుడి తల్లిదండ్రుల ఆరోపణ
మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయింపు

సంగారెడ్డి టౌన్: డబ్బు కోసం పసివాడి ప్రాణాలతో వైద్యులు ఆడుకున్నారు. ఇదేమని అడిగదితే రూ.5 లక్షల వెలకట్టారంటూ బాధితులు బోరున విలపించారు. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం తొగర్‌పల్లికి చెందిన బీ రాజు, లావణ్య దంపతుల కుమారుడు వర్శిత్ (6) వాంతులు చేసుకుంటుండటంతో గురువారం గాయత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ చక్రపాణి బాబును పరిశీలించి చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత హడావుడిగా అంబులెన్సును పిలిపించి, బాబుకు ఆక్సిజన్ పెట్టి హైదరాబాదుకు తీసుకెళ్లాలని చెప్పారు.

రామచంద్రపురం ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి డాక్టర్లు పరిశీలించి బాబు మృతిచెంది చాలా సేపైనట్టు వెల్లడించారు. డాక్టర్ చక్రపాణి నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడంటూ బాధితులు చిన్నారి మృతదేహంతో గాయత్రి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ముందే చికిత్స తమ వల్ల కాదని చెప్పి ఉంటే వేరే చోటకు తీసుకెళ్లే వారమని చిన్నారి బాబాయి శ్రీనివాస్ విలపించారు. తన అన్నకు ఈఎస్‌ఐ కార్డు ఉండటంతో డబ్బులు గుంజేందుకే వైద్యం చేస్తున్నట్టు నటించారని, ఇదేమని అడిగితే ఆస్పత్రి సిబ్బంది ఎదురుదాడికి దిగారని ఆయన ఆరోపించారు. కాగా, ఆసుపత్రి నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ కుమార్‌రాజ చిన్నారి ప్రాణానికి పరిహారంగా రూ.5 లక్షలిస్తామని బేరమాడారని బాధితులు ఆరోపించారు.

 కోర్టుకెళ్లండి: డాక్టర్ చక్రపాణి
బాబుకు మెదడు వాపు వ్యాధి ఉందని, ప్రాథమిక చికిత్స అందించి ఆపై హైదరాబాదు తీసుకెళ్లాలని చెప్పామని గాయత్రి చిల్డ్రన్ నర్సింగ్ హోమ్ వైద్యుడు చక్రపాణి చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లే సరికి బాబు ప్రాణాలతోనే ఉన్నాడన్నారు. బాధితులు కోర్టుకెళ్లాలని, కోర్టు తీర్పు ప్రకారం పరిహారం చెల్లిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు