తల్లీ.. వెళ్లిపోయావా..

25 Jun, 2017 23:51 IST|Sakshi
చిన్నారి శరీరభాగాలను స్వగ్రామానికి తరలిస్తున్న అధికారులు

బోరుబావిలో పడిన చిన్నారి మృతి
కడసారి చూపునకూ నోచని తల్లిదండ్రులు         
పాప డ్రెస్, శరీర భాగాలే లభ్యం
ఫలితమివ్వని 60గంటల రెస్క్యూ ఆపరేషన్‌         
స్వగ్రామం గోరెపల్లిలో అంత్యక్రియలు
అన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకోలేక పోయాం : మంత్రి, జిల్లా కలెక్టర్‌


చిట్టి తల్లీ వెళ్లిపోయావా.. కడసారి చూపుకూ నోచుకోలేక పోయాం తల్లీ.. ఏ దేవుడూ మా ప్రార్థనలు ఆలకించలేదు చిన్నారీ. నిన్ను కాపాడకోలేక పోయాం.. మమ్మల్ని మన్నించు తల్లీ.. నీ ముద్దు ముద్దు మాటలు వినే భాగ్యం మాకు లేకుండా పోయాయి. నిన్ను ఎలా మరిచిపోగలం అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వేలాది మంది చేసిన ప్రార్థనలు.. అధికార యంత్రాంగం ప్రయత్నాలు
ఆ చిన్నారిని కాపాడలేక పోయాయి. పాప చనిపోయిందన్న వార్త విన్న ప్రజలు బోరుమన్నారు. – చేవెళ్ల/మొయినాబాద్‌:


చేవెళ్ల/మొయినాబాద్‌: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి ఘటన విషాదాంతంగా ము గిసింది. పాపను రక్షించాలని 60 గంటలపాటు నిర్విరామంగా సాగిన ఆపరేషన్‌.. సఫలీకృతం కాలేదు. ఏడాదిన్నరకే.. ఆ పాలబుగ్గల పాపకు నూరేళ్లు నిండడం ప్రతిఒక్కరినీ కలచివేసింది. పాప ఇక లేదన్న వార్తతో అందరి హృదయాలు ద్రవించిపోయాయి. బిడ్డ ఎలాగైనా సురక్షితంగా బయటకు రావాలని నిండు మనసుతో దేవుళ్లకు ప్రార్థించినా.. అది నెరవేరలేదు. పాప అందరినీ విడిచి పోయిందని, ఇక లేదని.. ఆదివారం ఉదయం 6.20 గంటల సమయంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రకటించారు. జిల్లా, రాష్ట్ర యంత్రాంగాలు సర్వశుక్తులు ఒడ్డి రెండున్నర రోజులపాటు శ్రమించినా.. ఫలితం లేకపోయింది.

కడసారి చూపునకు కన్నతల్లిదండ్రులు నోచుకోలేదు. పాప బోరుబావిలో పడినప్పటి నుంచి పాపను క్షేమంగా మీకు అప్పగిస్తామని యంత్రాంగం ధైర్యం చెబుతూ వచ్చినా.. సాధ్యపడలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఓఎన్‌జీసీ, సింగరేణి తదితర బృందాలు చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. బోర్‌బావుల తవ్వకాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల సహాయమూ నష్టాన్ని నివారించలేకపోయింది. అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలు చేసినా.. కడుపుకోతే మిగిలింది. బోరుబావుల ప్రమాద సంఘటనల్లో కెల్లా అత్యంత కఠినమైన రెస్క్యూ అపరేషన్‌గా దీన్ని భావిస్తున్నారు.

ముందు ఫ్లషింగ్‌కు అంగీకరించని తల్లిదండ్రులు..
సాంకేతికను ఉపయోగించినా బోరుబావిలో పాప జాడ కనిపించలేదు. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి మరింత లోతుకు జారినప్పటి నుంచి.. అత్యాధునిక సీసీ కెమెరాలను ఉపయోగించారు. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరించే కెమెరా సేవల్ని వినియోగించినా ఫలి తం లేకపోయింది. పాప 400 అడుగుల్లోతు ఉండొచ్చని.. అప్పటికే 60 గడవడంతో చనిపోయి ఉండవచ్చన్న ప్రాథమిక నిర్దరణకు అధికారులు వచ్చారు. దీంతో చివరకు ఫ్లషింగ్‌ ఒక్కటే మార్గమని యంత్రాంగం భావించింది. ఈ విధానాన్ని అవలంబిస్తామని అధికారులు.. మొదట పాప తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. తమ బిడ్డ మృతదేహానైనా కడసారి చూసే భాగ్యం కల్పించాలని కన్నీరుమున్నీరవుతూ అధికారులను వేడుకున్నారు.

చివరకు కుటుంబ సభ్యుల సహకారంతో వారిని ఒప్పించగలిగారు. ఆ తర్వాత ఫ్లషింగ్‌ ప్రక్రియను చేపట్టారు. బోర్‌ రిగ్‌ ద్వారా బోరుబావిలోకి అధిక ఒత్తి డిని గొట్టం ద్వారా పంపడంతో.. ఒక్క ఉదుటున లోపల ఉన్న మట్టితోపాటు నీళ్లు బయటికి ఎగిరి పడ్డాయి. ఆతర్వాత పాప ధరించిన ఫ్రాక్‌ .. ఆ వెంటనే దుర్వాసన వెదజల్లుతూ చిన్నారి శరీర భాగాలు కొన్ని ఎగిరిపడ్డాయి. వెంటనే పాప వస్త్రాన్ని, శరీర అవశేషాలను సేకరించిన సహాయక బృందాలు.. మరో వస్త్రంలో మూటకట్టి శవపరీక్ష నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వలస కూలీగా వచ్చి.. బిడ్డను పోగొట్టుకుని
వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం గోరెపల్లికి చెందిన యాదయ్య, రేణుకలు తమ ఇద్దరు పాపలతో కలిసి ఏడాది కిత్రం చనువెళ్లి గ్రామానికి వలస వచ్చారు. స్థానిక రైతు మల్లారెడ్డికి చెందిన పాలీహౌస్‌లో పనికి కుదిరిన ఆ కుటుంబం.. పొలం వద్దనే ఉన్న చిన్న గదిలో నివాసం ఉంటూ వ్యవసాయ పనులు చేసేవారు. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని వచ్చినా.. ఇద్దరి బిడ్డలే తమ ప్రాణాలు భావించారు. వారి కళ్ల ముందు ఆడుతూ పాడుతూ చిన్న పాప చిన్నారి గురువారం సాయంత్రం ఇంటికి సమీపంలోని బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. దీన్ని చూసిన పెద్ద పాప హర్షిత.. పక్కనే పాకలో ఆవులకు పాలు పితుకుతున్న తండ్రి యాదయ్యకు విషయాన్ని చెప్పింది.

హుటాహుటిన వచ్చిన తండ్రి పాప ఏడుపులను గమనించి క్షణాల్లో అప్రమత్తమై స్థానికలతో కలిసి పాపను కాపాడేందుకు ప్రయత్నించారు. బోరుబావిలో ఉన్న బోరుమోటారును పైకి లాగేందుకు యత్నించారు. కాని పాప పైకి రాకపోగా 10 అడుగుల లోతులో నుంచి 40 అడుగుల లోతుకి వెళ్లింది. అక్కడ మోటర్, బోరుబావి అంచుకు మధ్య చిక్కుకుంది. పై నుంచి మట్టి పడడంతో పైకి లాగినా సాధ్యపడలేదు. అప్పటి నుంచి ఆదివారం ఉదయం వరకు పాపకోసం పలు విధాలుగా చేసిన రెస్క్యూ అపరేషన్‌లు ఫలించకపోగా.. కడచూపుకూ దూరమైంది.

ఘటన రోజు..
గురువారం సాయత్రం 6–45 గంటలకు బోరుబావిలో చిన్నారి పడినట్లు తెలిసిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చనువెళ్లికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి కలెక్టర్‌కు సమాచా రం అందించారు. అప్పటికే స్థానిక పోలీసులు, 108 అబులెన్స్‌లు వచ్చి సహయక చర్యలల్లో భాగంగా చిన్నారికి  ఆక్సిజన్‌ అందించే ఏర్పాటు చేశారు. అప్పటికే స్థాని కుల సహాయంతో అధికారులు బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తీసే పనులు ప్రారంభించారు. రాత్రి 10 గంటలకు కలెక్టర్‌ రఘునందన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. షేక్‌పేట నంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఒక్కటి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంది. అప్పటికే సమాచారం అం దుకున్న నల్లగొండ జిల్లాకు చెందిన పుట్టం కరుణాకర్‌ అక్కడికి చేరుకున్నాడు. అతడు సీసీ కెమెరాలను లోపలికి పంపించి.. 40అడుగుల లోతులో పాప ఉందని, ప్రాణా లతో ఉన్నట్లు గుర్తించాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు.

రాడ్‌ల సహయంతో పాప చేతికి తాడు బిగించి బయటకు తీసేందుకు శ్రమించినా.. ఫలితం లేకపోయింది. దీంతో తెల్లవారుజామున మంగళగిరి నుంచి వచ్చిన మరో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం పాపను బయటకు తీసేందుకు అటోమెటిక్, మాన్యువల్‌ రోబో పరికరాలను ఉపయోగించారు. శుక్రవారం రాత్రి వరకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగినా సఫలం కాలేదు.

సాంకేతికతకూ లభించని జాడ
శుక్రవారం రాత్రి మొత్తం తవ్వకాలు కొనసాగించారు. పాప పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్సిజన్‌ను నిరంతరాయంగా అందించారు. పాప ఆరోగ్య పరిస్థితిని సైతం తెలుసుకునేందుకు నిపుణులు డీఆర్‌డీఓ అధికారి, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ బృందాన్ని రప్పించి పరిస్థితిని సమీక్షించింది. 24 గంటలు దాటిన తర్వాత ఎన్‌డీఆర్‌ఎప్‌ బృందం చర్యలు çఫలించకపోవటంతో బోరుమోటర్‌ను బయటకు తీస్తే పాపకూడా బయటకు వస్తుందని బోరుమోటర్‌ను తీశారు. అయితే పాప బయటకు రాకపోగా 40 అడుగుల నుంచి మరింత లోతులోకి వెళ్లిపోయింది. దీంతో పాపను గుర్తించటం కష్టంగా మారింది. సీసీ కెమెరాలకూ జాడ కనిపించలేదు. దీంతో సింగరేణి, ఓఎన్‌జీసీ బృందాలను రంగంలోకి దించారు. శనివారం వచ్చిన ఈ ప్రత్యేక బృందాలు సైతం పరిస్థితి చేయి దాటిపోయిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక అత్యాధునిక సీసీ కెమెరాలను సైతం తెప్పించారు. సముద్ర గర్భంలో సైతం ఉన్నవాటిని స్పష్టంగా గుర్తించడం దీని ప్రత్యేకత. ఈ మ్యాట్రిక్స్‌ కెమెరాతో పరిశీలించినా 110 నుంచి 210 అడుగుల వరకు పాప జాడ కనిపించలేదు.

గుంతలను పూడ్చివేసిన అధికారులు
చనువెళ్లిలో రైతు రాంరెడ్డి పొలంలో వేసిన బోరుబావిలో పడిన చిన్నారి కోసం ఎకరం విస్తీర్ణంలో దాదాపు 32 అడుగల మేర గొయ్యి తీశారు. చివరకు పాప చనిపోయిందని ఖరారు కావడంతో ఆ గొయ్యిని పూడ్చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి రేయింబవళ్లు జిల్లా, రాష్ట్ర యంత్రాంగం  శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌ ముగియడంతో అక్కడే ఉన్న ఇటాచీలతో గుంతలను పూడ్చేశారు.

నిరాశే మిగిలింది
క్షణక్షణం ఉత్కంఠను తలపించిన చిన్నారి ఆపరేషన్‌కు తెరపడింది. బోరుబావిలో పడిన చిన్నారిని కడసారైనా చూద్దామని తరలివచ్చిన ప్రజలకు చివరకు నిరాశే మిగిలింది.  మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు మూడు రోజులపాటు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి వరుస కట్టారు. పరిసర ప్రాంత గ్రామాల ప్రజలంతా చేరుకున్నారు. చిన్నారి క్షేమంగా బయటకు వస్తుందని ఉత్కంఠగా ఎదురుచూశారు. శుక్రవారం, శనివారం రోజంతా వేల సంఖ్యలో జనం వచ్చి చిన్నారిని ఎలా బయటకు తీస్తున్నారని ఆసక్తిగా చూశారు. బోరు మోటారును బయటకు లాగడంతో చిన్నారి ప్రాణాలపై ఆధికారుల్లో ఆశలు సన్నిగిల్లాయి. అదే సమయంలో ప్రజల్లో సైతం చిన్నారి ప్రాణాలతో బయటకు వస్తుందనే ఆశ తగ్గింది. అయినా ఎక్కడో చిన్న ఆశ. ఎలాగైనా ప్రాణాలతో బయట పడుతుందన్న నమ్మకంతో.. రేయింబవళ్లు నిద్రాహారాలు మానేసి అక్కడే వేచి చూశారు. చివరకు ఫ్లషింగ్‌ ద్వారా చిన్నారి బట్టలు, అవశేషాలు మాత్రమే బయటకు రావడంతో.. అందరి కళ్లలో కన్నీళ్లు కనిపించాయి.

60 గంటలపాటు అక్కడే..
చిన్నారిని రక్షించాలని యంత్రాంగం సవాలుగా తీసుకుంది. ఈ మేరకు శక్తివంచన లేకుండా శ్రమించింది. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు రెస్క్యూ బృందం,  ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధంగా వచ్చిన బోర్‌వెల్స్‌ యజమానులు ఎంతో కృషి చేశారు. 60 గంటలపాటు సాగిన ఆ ఆపరేషన్‌.. అత్యంత క్లిష్టమైనదిగా యంత్రాంగం భావించింది.  గతంలో బోరుబావిలో పడిన చిన్నారులను ఒక్కటి రోజుల్లో రెస్క్యూ బృందాలు రక్షించాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలు పోయినా.. చివరకు మృతదేహాలనైనా బయటకు తీసేవి. కానీ చిన్నారి విషయంలో ఆ రెండూ సాధ్యపడలేదు.

రేయింబవళ్లు పర్యవేక్షణ
బోరుబావిలో చిన్నారి పడిన అరగంటకే.. ఘటనా స్థలానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చేరుకున్నారు.  ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉండి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతోపాటు సహాయక చర్యలు చురుగ్గా జరిగేలా చూశారు. సైబరాబాద్‌ సీపీ సందీశాండిల్యా, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లాఆర్,  మాజీ మంత్రి సబితారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి,  డీసీపీ పద్మాజారెడ్డి, ఏసీపీలు గంగిరెడ్డి, శృతకీర్తి, ఫైర్‌ అధికారి హరినాథ్‌రెడ్డి, ఎన్‌ఆర్‌డీఎఫ్‌ కమాండర్‌ డీఎన్‌ సింగ్‌ తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఎన్నడూ ఊహించలేదు..
బోరుబావి యజమాని రాంరెడ్డి పశ్చాత్తాపం చెందారు. తన బోరు చిన్నారిని బలితీసుకుంటుందని ఎన్నడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం బోరుబావిని మూసే ఉంచానని చెప్పారు. ఇటీవల వర్షాలు కురవడంతో.. నీటి ఊట వచ్చి ఉంటుందని మోటారు బిగించామని పేర్కొన్నారు. చిన్నారి తండ్రి సహకారంతోనే ఈ పనులు పూర్తి చేశామన్నారు.

శతవిధాలా ప్రయత్నాలు..
శనివారం సాయంత్రం కెఎల్లార్‌ ఇండస్ట్రీస్‌ యజమాని, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వచ్చి పరిశీలించారు. ఆయన బోరుబావులు వేయటంలో నిపుణులు కావటంతో అధికారులతో చర్చించారు. పాప 40 అడుగుల లోతు నుంచి లోపలికి వెళ్లే అవకాశం ఉండదని, బోరుమోటర్‌ను పైకి లాగే ప్రయత్నంలో పాప ఇదే లోతులో ఎక్కడో ఒక చోట పక్కకు చిక్కుకుని ఉండొచ్చని అధికారులకు చెప్పారు. 40 అడుగుల తర్వాత రైతు వేసే బోరుబావిలో పాప పట్టదని స్పష్టం చేశారు. దీంతో కేఎల్లార్‌ ప్రయత్నాలకు యంత్రాంగం అవకాశమిచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పాపను గుర్తించే వరకు కేఎల్లార్‌ అధీనంలో అపరేషన్‌ కొనసాగింది. అప్పటికే పాప బతికే అవకాశాలు లేవని యంత్రాంగం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వెంటనే బోరుబావిలోకి ఆక్సిజన్‌ అందించే పనులను నిలిపివేశారు. కేఎల్లార్‌ తన కంపెనీ నుంచి ప్రత్యేక వాహనాలను రప్పించారు.

ముందుగా సమాంతరంగా బోరు వేసి ఫ్లషింగ్‌ ద్వారా పాప మృతదేహాన్ని బయటకు తీయాలని భావించారు. కానీ తల్లిదండ్రులు పాప దేహాన్ని ఛిద్రం చేయవద్దని కోరారు. అయితే మొదటగా 40 అడుగుల లోతులో పాప చిక్కుకుని ఉండొచ్చని భావించి¯ గొయ్యి తీయాలని నిశ్చయించారు. అప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. ఫ్లషింగ్‌ చేయక తప్పదని నిర్ణయానికి వచ్చారు. దాదాపు 260 అడుగుల లోతు వరకు హై ఫ్లషింగ్‌ చేయటంతో లోపల నుంచి నీటితోపాటు చిన్నారి డ్రెస్‌ రెండు ముక్కలుగా బయటకు వచ్చింది. ఆ తర్వాత పాప శరీర అవయవాలు కొన్ని బయటపడ్డాయి.
కూతురు మృతి చెందిందన్న వార్త విని రోదిస్తున్న చిన్నారి తల్లిదండ్రులు

యాలాల మండలం గోరెపల్లిలో అంత్య్రక్రియలు నిర్వహిస్తున్న బంధువులు

మరిన్ని వార్తలు