అటుపావనఝరి .. ఇటు సాంస్కృతిక సిరి

2 Oct, 2016 04:56 IST|Sakshi
అటుపావనఝరి .. ఇటు సాంస్కృతిక సిరి
  • 1934 నుంచి అవిచ్ఛిన్నంగా దేవీచౌక్‌లో నవరాత్ర వేడుకలు
  • 83వ వసంతంలోకి అడుగుపెట్టిన సంబరాలు
  • నాటి మూడులాంతర్ల సెంటరే నేటి దేవీచౌక్‌
  • రూ.200 ఖర్చుతో మెుదలు.. నేడు రూ.లక్షలతో నిర్వహణ
  •  
    చారిత్రక నగరి రాజమహేంద్రవరానికి దైవమిచ్చిన ద్రవరూపవరంలా ప్రవహించే జీవనది గోదావరి జలతరంగిణి అయితే.. దానికి కూతవేటు దూరంలోని ఓ కూడలి పావన శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ‘జనతరంగిణి’గా తుళ్లిపడుతుంది. అదే దేవీచౌక్‌. దేశంలో దసరా ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు తరువాత అంతటి ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి తెలుగువారి సాంస్కృతిక రాజధాని నడిబొడ్డున ఇక్కడ జరిగే బాలా త్రిపురసుందరి అమ్మవారి నవరాత్ర వేడుకలు. ఎనిమిది దశాబ్దాలకు పైగా నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్రలో అంతర్భాగమైన దేవీచౌక్‌ ఉత్సవాలలో– ఒక్కప్రదర్శనలో పాల్గొన్నా, జన్మ ధన్యమైనట్టు కళాకారులు భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. అంతరించిపోతున్న పౌరాణిక నాటకాలకు ఊపిరులూదుతున్న ఈ ఉత్సవాలలో భక్తి, కళలు, రక్తి, ముక్తి పెనవేసుకుపోయి నగర కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తున్నాయి. పున్నమినాటి పండు వెన్నెల్లో గోదావరి అలల మిలమిలలను చూస్తే వచ్చే సంతోషంతో.. నవరాత్ర వేడుకల్లో రాత్రి వేళల్లో దేవీచౌక్‌ సంరంభాన్ని తిలకిస్తే కలిగే ఆనందం పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. 
     
    రాజమహేంద్రవరం కల్చరల్‌ :
    నగరంలోని ముఖ్య కూడళ్లలో ఒకటైన దేవీచౌక్‌ను 1962 వరకూ మూడు లాంతర్ల సెంటరుగా వ్యవహరించే వారు. మునిసిపాలిటీ ఇక్కడ మూడు లాంతర్లతో దీపాలు బిగించడంతోనే ఆ పేరు వచ్చింది. 1940 నుంచి1974 మధ్యకాలం దేవీచౌక్‌ ఉత్సవాలకు స్వర్ణయుగమని భావించవచ్చు. నాటక, సినీరంగాలకు చెందిన ప్రముఖ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడానికి ఆసక్తి చూపేవారు. మొదట్లో హరికథలు, బుర్రకథలు, భజనలు ప్రదర్శించగా తరువాత సురభి కళాకారుల పౌరాణిక నాటకాలు,  సాంఘిక నాటకాలు ప్రదర్శించేవారు.  
    దిగ్గజ  కళాకారులకు వేదికగా..
    దేవీచౌక్‌ ఉత్సవాలలోఒక్కఛాన్స్‌ వస్తే చాలనుకునే కళాకారులు నాడు భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. అలనాటి ప్రముఖ కళాకారులు ఈలపాటి రఘురామయ్య, సూరిబాబు, షణ్ముఖ ఆంజనేయరాజు, పీసపాటి,  రేలంగి వెంకట్రామయ్య, అభినవ అంజనేయుడు సంపత్‌నగర్‌ లక్ష్మణరావు వంటి ఎందరో కళాకారులు ఇక్కడప్రదర్శనల ద్వారా సార్థకం చేసుకున్నట్టు భావించేవారు. సినీ ప్రముఖులు సి.ఎస్‌.రావు–రాజసులోచన, జెమినీగణేశన్‌–సావిత్రి, ఆదినారాయణ రావు–అంజలి, చలం–శారద దంపతులు, కైకాల సత్యనారాయణ, నూతన్‌ప్రసాద్, రావు గోపాలరావు తదితరులు ఇక్కడ సత్కారాలను అందుకున్నారు. 
     
    వీరే సారథులు..
    ఉత్సవాలను ఏటా నిర్వహించే శ్రీదేవి ఉత్సవకమిటీలో ప్రస్తుతం తోలేటి ధనరాజు అధ్యక్షునిగా, బత్తుల రాజేశ్వరరావు, ముత్యాల కుమారరెడ్డి ఉపాధ్యక్షులుగా, పడాల శివరామలింగేశ్వరరావు కార్యదర్శిగా, ఆండ్ర నమశ్శివాయ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. నలుగురు సహాయకార్యదర్శులు, 38 మంది కమిటీసభ్యులు ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నారు.
     
    దేవీచౌక్‌గా రూపాంతరం ఇలా...
    1934లో దివంగత బత్తుల నాగరాజు, బత్తుల మునియ్య సోదరులు దేవీ నవరాత్ర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నాడు కేవలం రూ.200తో చేపట్టిన ఈ ఉత్సవాలను నేడు దాతల సహకారంతో, లక్షలాది రూపాయలతో నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యుడు దివంగత బత్తుల మల్లికార్జునరావు (చంటి)ఉత్సవాలకు ఊపు తీసుకువచ్చారు. 1963లో కలకత్తానుంచి బాలాత్రిపురసుందరి పాలరాతి విగ్రహాన్ని తెచ్చి, ప్రతిషి్ఠంచిన నాటినుంచి మూడులాంతర్ల సెంటర్‌ కాస్తా దేవీచౌక్‌గా మారిపోయింది.  
     
     
    ఇది నా పూర్వజన్మ సుకృతం
    దేవీచౌక్‌ ఉత్సవాలకు మూలస్తంభంగా చెప్పుకోవలసిన దివంగత బత్తుల మల్లికార్జునరావు మా తండ్రి. గత పదేళ్లుగా  ఉత్సవాలకు అలంకరణ బాధ్యతను నిర్వహిస్తున్నాను.  ఇది నా పూర్వజన్మ సుకృతం. అమ్మవారి ఆశీస్సులే నా ప్రగతికి కారణమని అనుకుంటున్నాను.
     – బత్తుల రాజరాజేశ్వరరావు, శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు
     
    నగర సాంస్క­ృతిక వైభవానికి ప్రతీక
    దేవీచౌక్‌లో 1992–93 ప్రాంతాలలో బుర్రకథలను వినిపించేవాడిని. సినిమాలు, టీవీలు స్వైరవిహారం చేస్తున్న ఈ రోజుల్లో పౌరాణిక నాటకాలను ప్రదర్శించడం అభినందనీయం.నగర సాంస్కృతికవైభవానికి ప్రతీక దేవీచౌక్‌ ఉత్సవాలు.
     – రాజగురు డాక్టర్‌ ఎం.ఆర్‌.వి.శర్మ 
    సమాజానికి శ్రేయస్కరం
    దేవీచౌక్‌ ఉత్సవాల్లో ప్రతినిత్యం సామూహిక కుంకుమపూజలు, లలితాపారాయణలు జర గడం సమాజానికి ఎంతో మంచిది. అంతరించిపోతున్న నాటకకళకు ఈ ఉత్సవాలు 
    ఊపిరులూదుతున్నాయి.
     – డాక్టర్‌ బి.వి.ఎస్‌.మూర్తి, సాహితీవేత్త 
    దేవీచౌక్‌ పేరును చాటిన ఉత్సవాలు
    దేవీపూజలకు మెసూరు, పశ్చిమ బెంగాల్, మన రాజమహేంద్రిలోని దేవీచౌక్‌ ఉత్సవాలు పెట్టిందిపేరు. దేవీచౌక్‌ పేరు రాష్ట్రంలోనే ప్రచారంలోకి రావడానికి ఈ ఉత్సవాలే కారణం.
     – గ్రంధి రామచంద్రరావు, 
    హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యుడు
     
    నగర కీర్తి కిరీటంలో కలికితురాయి
    తెలుగువారి సాంస్కృతిక రాజధాని కీర్తి కిరీటంలో కలికితురాయి దేవీచౌక్‌ ఉత్సవాలు. నేటికీ కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి ఆసక్తి  చూపుతున్నారు.  – సరసకవి డాక్టర్‌ ఎస్వీ రాఘవేంద్రరావు
    ఆ అవకాశంకోసం ఎదురుచూస్తున్నాను
    ఎన్నోఅద్భుతమైన నాటకాలకు దేవీచౌక్‌ వేదిక అయింది. ఆరోజుల్లో ప్రజలు నిలబడి నాటకాలు చూసేవారు. గాయకునిగా దేవీచౌక్‌లో అవకాశానికి ఎదురుచూస్తున్నాను. – ఎర్రాప్రగడ రామకృష్ణ, కవి, గాయకుడు
     
    మన సంస్కృతిలో అంతర్భాగం
    కళాకారులు తమప్రతిభకు గీటురాయిగా ఈ ఉత్సవాలను భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. ఈ ఉత్సవాలు మన సంస్కృతిలో అంతర్భాగం. 
    – ప్రాణహితకవి సన్నిధానం నరసింహశర్మ 
     
     
>
మరిన్ని వార్తలు