యథేచ్ఛగా రంగురాళ్ల వేట

13 Oct, 2016 17:10 IST|Sakshi
రంగురాళ్లు వెతికేందుకు వచ్చిన కూలీలు (ఫైల్‌)
* పల్నాడు అటవీ ప్రాంతంలో తవ్వకాలు
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమాలు
ఆదివారం మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం
భట్రుపాలేనికి చెందిన టీడీపీ నేతలవిగా గుర్తింపు
 
సాక్షి, గుంటూరు: పల్నాడులోని దాచేపల్లి, బెల్లంకొండ అటవీ భూముల్లో రంగు రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఏడాదిగా ఈ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ జూన్‌లో అటవీ అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకుని తవ్వకాలను నిలిపివేశారు. అయితే రాత్రిపూట రహస్యంగా టార్చిలైట్‌ల వెలుతురులో తవ్వకాలు జరిపించిన అధికార పార్టీ నేతలు పది రోజులుగా ఉధృతం చేశారు. రంగురాళ్ల తవ్వకాలు జరిగే ప్రాంతంలో మూడు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసినట్లు స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. ఇవి ఆదివారం అర్ధరాత్రి దగ్ధమైనట్లు తెలిసింది. ఈ ద్విచక్ర వాహనాలు దాచేపల్లి మండలం భట్రుపాలేనికి చెందిన అధికార పార్టీ నేతలవిగా చెబుతున్నారు. రంగురాళ్ళ కోసం తవ్వకాలు జరిపేది అధికార పార్టీ నేతలే అనడానికి ఇంతకంటే మరో ఉదాహరణ లేదు. స్థానిక అధికార  పార్టీ నేతలు కొందరు హైదరాబాద్‌కు చెందిన దళారుల సహాయంతో తవ్వకాల్లో లభ్యమైన రంగురాళ్ల ముడిసరుకును నేరుగా రాజస్థాన్‌కు రవాణా చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. రంగురాళ్ల వేట అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఆవైపునకు తిరిగి చూడడం లేదు. పది రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరిగినప్పటికీ తమకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తున్నారు. 
 
దాచేపల్లి మండలం శంకరాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పది రోజులుగా భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాలకు చెందిన కూలీలు గ్రూపులుగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ గ్రూపులన్నీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల కనుసన్నల్లోనే రంగురాళ్ల వేట సాగిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా శంకరాపురం అడవుల్లో 15 నుంచి 20 అడుగుల లోతు సొరంగాలు తవ్వుతున్నారు. ఈ ప్రాంతంలో రంగు రాళ్ల ముడి రాయి అధికంగా దొరుకుతుంది. ఇక్కడ రంగు రాళ్లతోపాటు బంగారు ఆభరణాల్లో ఉపయోగించే ఖరీదైన జాతి రాళ్లు సైతం దొరుకుతుండటంతో మాఫియాగా తయారై తవ్వకాలు సాగిస్తున్నారు.
 
అన్నీ తెలిసినా అటువైపు చూడని అధికారులు.. 
అటవీ ప్రాంతాల్లోని తండాల ప్రజలు బోరు వేసుకోవాలన్నా అనుమతుల కోసం ఇబ్బందులు పెట్టే అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. తవ్వకాల్లో ఓ కూలి ప్రమాదవశాత్తు మృతి చెందినప్పటికీ దాన్ని కూడా బయటకు పొక్కనీయకుండా గప్‌చుప్‌గా అంత్యక్రియలు కానిచ్చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. తాజాగా తవ్వకాలు జరిగే ప్రాంతంలో అధికార పార్టీ నేతలకు చెందిన మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం కావడంతో ఇప్పటికైనా పోలీస్, అటవీశాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తారా లేదా అనే చర్చనీ యాంశమైంది.
మరిన్ని వార్తలు