రూ.1000కే దీపం గ్యాస్‌ కనెక‌్షన్‌

2 May, 2017 21:23 IST|Sakshi
రూ.1000కే దీపం గ్యాస్‌ కనెక‌్షన్‌
- ఒక కనెక‌్షన్‌ ఇప్పిస్తే రూ.25 ఇన్సెంటివ్‌
 
కర్నూలు(అగ్రికల్చర్‌): దీపం పథకం కింద గ్యాస్‌ కనెక‌్షన్ల పంపిణీని వేగవంతం చేసేందుకు జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త పథకానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ రేషన్‌ కార్డు కలిగి ఉండి ఇంత వరకు గ్యాస్‌ కనెక‌్షన్‌ లేని వారికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం జూన్‌ నెల నుంచి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కిరోసిన్‌ రహిత రాష్ట్రంగా ప్రకటించాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఈ నెల చివరి లోపు కనెక‌్షన్ల పంపిణీని పూర్తి చేయాలని గ్యాస్‌ డీలర్లను ఆదేశించారు.
 
 
రూ.1000కే గ్యాస్‌ సిలెండర్, రెగ్యులేటర్, గ్యాస్‌ పైపు, పాస్‌బుక్‌ ఇస్తారన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి ఈ పథకాన్ని వర్తింప చేయాలన్నారు. లబ్ధిదారులు ఐఎస్‌ఐ మార్క్‌ కలిగిన స్టవ్‌ను మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఇందుకు రూ.990 చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, డీలర్లు, గ్రామ డిజిటల్‌ అసిస్టెంట్లు రేషన్‌ కార్డు ఉండి గ్యాస్‌ కనెక‌్షన్‌ లేని కుటుంబాలను గుర్తించి గ్యాస్‌ డీలరు దగ్గరకు తీసుకెళ్లి కనెక‌్షన్‌ ఇప్పిస్తే అక్కడికక్కడే రూ.25 ఇన్సెంటివ్‌ డీలరు చెల్లిస్తారని తెలిపారు. హెచ్‌పీసీ, ఐఓసీ కంపెనీలు దీపం పథకం కింద గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తాయన్నారు. గ్యాస్‌ సిలెండర్లు డోర్‌ డెలివరీ చేసే బాయ్‌లు బిల్లు ధర కంటే రూ.25 నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని.. అడ్డుకట్ట వేయాలని డీలర్లకు ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ సుబ్రమణ్యం, మెప్మా పీడీ రామాంజనేయులు, ఏఎస్‌ఓలు రాజా రఘువీర్, వంశీకృష్ణారెడ్డి, ఐఓసీ, హెచ్‌పీసీ కంపెనీల సేల్స్‌ ఆఫీసర్లు హరికృష్ణ, మురళీ, సీఎస్‌డీటీలు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు