డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల గడువు పొడిగింపు

7 Jun, 2016 01:43 IST|Sakshi

కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఇటీవల ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగియగా.. పొడిగించినట్లు కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు తమ దరఖాస్తులను జాగ్రత్తగా అప్‌లోడ్ చేయూలని, సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఏ కాలేజీ బాధ్యులకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఆయన తెలిపారు.
 
ఇప్పటివరకు 17,845 దరఖాస్తులే
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో ఇప్పటి వరకు 17,845 దరఖాస్తులే వచ్చాయి. మొత్తం 21,633 మంది విద్యార్థులు రూ.100 చొప్పున ఫీజు చెల్లించినా అందరూ దరఖాస్తు చేసుకోలేదు. మూడు జిల్లాల్లోని కళాశాలల్లో ఒక లక్ష 25వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైతే దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు