‘వంద’ వస్తేనే సీటు

28 Jun, 2013 16:09 IST|Sakshi
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ నూతనంగా పరిచయం చేసిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే విద్యార్థుల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఆది నుంచి విమర్శలు వచ్చిన ఈ నాలుగేళ్ల కోర్సుపై అధిక మంది విద్యార్థులు ఆసక్తిని చూపుతుండటంతో సీటు దొరకడం గగనంగా మారుతోంది. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)కు అనుబంధంగా ఉన్న ఓ కాలేజీ బుధవారం రాత్రి విడుదల చేసిన తొలి కటాఫ్ జాబితా మరోసారి వంద శాతం మార్కులకు చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సారి బీటెక్ (కంప్యూటర్ సెన్సైస్) విభాగంలో రాంలాల్ ఆనంద్ కాలేజీ కటాఫ్‌ను వంద శాతంగా ఖరారు చేసింది.
 
 2011 సంవత్సరంలో ప్రతిష్టాత్మక శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్‌ఆర్‌సీసీ)లో బీకాం (ఆనర్స్) కటాఫ్ జాబితా 100 శాతానికి చేరుకోవడంతో అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని వైస్ ఛాన్సలర్‌ను కోరారు. అయినప్పటికీ ఈ ఏడాది కూడా మళ్లీ తొలి కటాఫ్ జాబితా 100 శాతం మార్కులకు చేరుకోవడం గమనార్హం.  బుధవారం రాత్రి విడుదల చేసిన తొలి కటాఫ్ జాబితా ప్రకారం డీయూలోని నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ఔత్సాహికులకు అడ్మిషన్ పొందడం అంత సులభం కాదని తెలుస్తోంది. హిందూ కాలేజీ, భాస్కరాచార్య కాలేజ్ ఆఫ్ అప్లయిడ్ సైన్స్‌లు కామర్స్, బీటెక్ కోర్సులకు 96.75 నుంచి 99.75 వరకు, 97.99 నుంచి 99.75 శాతం మార్కులను కటాఫ్‌గా నిర్ణయించాయి. గతేడాది డీయూలోని అన్ని కళాశాలల కన్నా 96.25 నుంచి 99.25 శాతంతో అధిక కటాఫ్ జాబితాతో హిందూ కాలేజీ అందరి కన్నా ముందున్న సంగతి తెలిసిందే. గతేడాది కామర్స్, ఎకనామిక్స్ కోర్సులకు 97 నుంచి 97.5 శాతం కటాఫ్‌గా ఎస్‌ఆర్‌సీసీ నిర్ణయించింది. కామర్స్ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థులకు కాలేజీలను ఎంపిక చేసుకునే విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ కోర్సుకు అధిక స్థాయి కటాఫ్ ఉండటంతో అడ్మిషన్ పొందడం విద్యార్థులకు గగనంగా మారనుంది. అన్ని కళాశాలల్లో కామర్స్‌కు కటాఫ్ జాబితా 90 శాతానికిపైగానే ఉంది.
 
 96.75-98.75తో హన్స్‌రాజ్, 97.75-98.75తో లేడీ శ్రీరామ్ కాలేజీ (ఎల్‌ఎస్‌ఆర్), 96-99 మధ్యలో షాహీద్ భగత్ సింగ్, 96.75 శాతంతో శ్రీ వెంకటేశ్వర కళాశాలలు తమ తొలి కటాఫ్ జాబితాను ప్రకటించాయి. ఎకనామిక్స్ కోర్సు తర్వాత అధిక మంది ఆసక్తి చూపే హిందూ కోర్సుకు 97.5 శాతంగా కటాఫ్ ఉంది. ఎల్‌ఎస్‌ఆర్ 97.75, హన్స్‌రాజ్ 97.25, మీరంద హౌస్ 96.5-97గా, కిరోరిమాల్ 95.5-98.5, రాంజస్ 94.5-97.5 శాతంగా తమ కటాఫ్‌ను ప్రకటించాయి.  ఈ ఏడాది కూడా కామన్స్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించిన ఇంగ్లిష్, జర్నలిజమ్ కోర్సుల్లో అడ్మిషన్‌లకు కూడా అధిక కటాఫ్ ఉంది. హిందూ కాలేజీలో అత్యధికంగా ఇంగ్లిష్ కోర్సుకు 98.5 శాతంగా నిర్ణయించింది. 
 
 జర్నలిజమ్ కోర్సును ఆఫర్ చేస్తున్న అన్ని ఆరు కళాశాలల్లో 90 శాతానికి పైగా మార్కులు వచ్చిన వారికే సీటు లభించేలా ఉంది. ఎకనామిక్స్‌తో పాటు అధిక ప్రాచుర్యం పొందిన కామర్స్ సబ్జెక్ట్‌లుగా కూడా ఆయా కళాశాలలు అధిక కటాఫ్ మార్కులను కేటాయించాయి. అలాగే ఎస్‌సీ, ఓబీసీ, వికలాంగులకు కూడా అధిక మార్కులు ఉంటేనే సీటు వచ్చేలాగా కనబడుతోంది. సెన్సైస్ కోర్సులో గణితం, భౌతిక శాస్త్రం కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది ఆఫర్ చేస్తున్న బీటెక్ కోర్సుల్లో కంప్యూటర్ సెన్సైస్, ఎలక్ట్రానిక్స్ కోర్సులకు విద్యార్థుల్లో తీవ్ర పోటీ నెలకొంది. అధిక మంది దరఖాస్తు చేసుకున్న ఈ కోర్సులకు ఆయా కాలేజీలు అధిక కటాఫ్ మార్కులు నిర్ణయించాయి. 
 
 కటాఫ్‌లతో కలవరం
 ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కళాశాలలు అధిక కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో విద్యార్థుల్లో గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. తాము ఇష్టపడిన కోర్సు కోసం దరఖాస్తు చేసిన ఔత్సాహికులు ఇప్పుడు ఇష్టం లేకున్నా మరో సబ్జెక్ట్‌ను ఎంచుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఎందుకంటే అధిక కటాఫ్ మార్కులకు చేరువగా లేకపోవడంతో ఇతర కోర్సులవైపు మళ్లుతున్నారు. ‘మీరంద హౌస్‌లో పొలిటికల్ సైన్స్ చేయాలనుకున్నా.అయితే కటాఫ్ మార్కులు అధికంగా ఉన్నాయి. దీంతో   ఫిలిసఫీని ఎంచుకోవాలనుకుంటున్నాన’ని మీరూట్‌కు చెందిన తాన్యా మాణిక్ వివరించింది. తనకు 95 శాతం మార్కులు వచ్చిన పొలిటికల్ సైన్స్‌లో సీటు దక్కుతుందన్న ఆశ లేదని తెలిపింది. ఏమైనప్పటికీ ఎల్‌ఎస్‌ఆర్ కళాశాలలో చదువుకోవాలనుకుంటున్నా.అవసరమనుకుంటే సబ్జెక్ట్‌ను కూడా మార్చుకుంటానని వేదిక కపూర్ తెలిపింది. 
 
>
మరిన్ని వార్తలు