‘డెల్టా’కు త్రుటిలో తప్పిన ప్రమాదం

7 May, 2016 03:06 IST|Sakshi
‘డెల్టా’కు త్రుటిలో తప్పిన ప్రమాదం

♦ రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయి గాల్లో తేలిన పట్టాలు
♦ ఎర్రని వస్త్రం ఊపుతూ రైలుకు ఎదురెళ్లిన రైతులు.. 1,500 మందికి తప్పిన ముప్పు
 
 వలిగొండ: డెల్టా ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. రైల్వే ట్రాక్ కింద మట్టి కట్ట కొట్టుకుపోయి పట్టాలు గాలిలో వేలాడడాన్ని చూసి ఇద్దరు రైతులు రైలును ఆపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సేఫ్టీ ఉద్యోగితో కలసి రైలుకు ఎదురుగా పరుగెడుతూ ఎరుపు వస్త్రం ఊపారు. దానిని గమనించిన లోకోపైలట్(డ్రైవర్) రైలును నిలిపేశాడు. 1,500 మందికిపైగా ప్రయాణికులతో వెళుతున్న ఆ రైలు.. ప్రమాదకర స్థలానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఆగింది. లేకుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో శుక్రవారం తెల్లవారుజామున 5.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

 వ్యవసాయ బావి వద్దకు వెళుతూ..: గుంటూరు-సికింద్రాబాద్ రైలు మార్గంలో వలిగొండ-నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 9వ నంబర్ గేట్ వద్ద నిర్మిస్తున్న ఆర్‌యూబీ (రోడ్డు అండర్ బ్రిడ్జి) వద్ద రైల్వే ట్రాక్ కింద మట్టికట్ట కొట్టుకుపోయింది. దాదాపు మూడు మీటర్ల మేర గండి పడడం తో పట్టాలు గాలిలో వేలాడాయి. శుక్రవారం ఉదయం 5.50 గంటల సమయంలో టేకులసోమారానికి చెందిన పాక వెంకటేశం, పాక శ్రీశైలం పాలు పితకడానికి బైక్‌పై వ్యవసాయబావి వద్దకు వెళ్తున్నారు. వారు 9వ నంబర్ గేట్ వద్దకు చేరుకోగానే... కల్వర్టు వద్ద నీరు నిలిచి ఉండడం గమనించారు. దగ్గరకు వెళ్లి చూసే సరికి రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి ఉంది. అదే సమయంలో డెల్టా రైలుకు సిగ్నల్ ఉండడం గమనించి.. వెంటనే అప్రమత్తమయ్యా రు. అక్కడ కాపలాగా ఉన్న రోడ్ సేఫ్టీ కాంట్రాక్టు ఉద్యోగి చేగూరి భిక్షపతికి విషయం చెప్పారు. ముగ్గురూ కలసి ఎర్రటి వస్త్రాన్ని చేతుల్లో తీసుకుని రైలుకు ఎదురుగా పట్టాల మీద పరుగెత్తారు. రైలు లోకోపైలట్ వారిని గమనించి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.

 ఆలస్యంగా రావడం మంచిదైంది: డెల్టా రైలు నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌కు ఉదయం 5:20 నిమిషాలకు చేరుకోవాలి. కానీ సుమారు అరగంట ఆలస్యంగా  వచ్చింది.   సమయానికి వచ్చి ఉంటే.. పట్టాల కింద మట్టి కొట్టుకుపోయిన విషయం తెలిసి ఉండేది కాదు. సమాచారం అందిన గంటకు ఆ స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది గండిని పూడ్చి, పట్టాలకు మరమ్మతులు చేపట్టారు. డెల్టా రైలు ఉదయం 8.20 గంటల వరకు అక్కడే ఆగిపోయింది.

 గతంలో భారీ ప్రమాదం: గతంలో ఇదే వలిగొండ మం డలం గొల్నేపల్లి వద్ద డెల్టా రైలు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కల్వర్టు కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రైలు పట్టాలు గాలిలో వేలాడాయి. డ్రైవర్ గమనించకపోవడంతో రైలు బోల్తా పడింది. 115 మంది మృతిచెందగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు.  తాజా ఘటనలో మట్టి కొట్టుకుపోవడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేమీ లేదని ఏడీఈ బదియా తెలిపారు. ‘నేను, నా సోదరుడు పాలు పితకడానికి వెళ్తున్నాం. 9వ నంబర్ గేట్ వద్ద నీరు చేరడంతో మట్టి కొట్టుకుపోయి పట్టాలు తేలి ఉన్నాయి. భిక్షపతితో కలసి రైలు ఆపాం.’ అని రైతు వెంకటేశం తెలిపారు.


 
 కారణమిదే..
 రైల్వే ట్రాక్ పక్కన నాగిరెడ్డిపల్లి వైపు నుంచి భారీగా వరద నీరు ఆర్‌యూబీ వంతెన వైపు చేరింది. ఆ నీటి ప్రవాహం ధాటికి వంతెన పక్కన ఉన్న మట్టి మూడు మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో పట్టాల కింద మట్టి పోయి గాలిలో వేలాడాయి. అయితే ఈ వంతెన పనులు రెండు నెలల క్రితం చేపట్టారు. ఆ ప్రదేశంలో పెద్ద బండ రాళ్లు వచ్చాయని... ప్రజలు, వాహనాలు, రైతుల రాకపోకలకు గమనిస్తూ బ్లాస్టింగ్ చేస్తుండడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా