డెల్టాకు జూన్‌ 1 కి నీరు విడుదల

11 Apr, 2017 00:26 IST|Sakshi

అమలాపురం : 

గోదావరి డెల్టా కాలువలకు జూన్‌ 1  నుంచి సాగునీరు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 15 నాటికి సాగునీరు ఇస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కవచ్చని... అపరాలు పండించుకునే అవకాశం దక్కుతుందని రైతులు కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ నెల 6వ తేదీన ‘ఖరీఫ్‌పై నీలి నీడలు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో కనీసం జూన్‌ 1  నాటికైనా సాగునీరు విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్రిటీష్‌ హయాంలో మే 15 నాటికి సాగునీరు విడుదల చేసేవారు. తరువాత రెండు పంటల విధానం రావడంతో నీటి విడుదల జూ¯ŒS 15 తరువాతకు మారింది. ఈ విధానం వల్ల ఖరీఫ్‌ పంట కోతల సమయంలో భారీ వర్షాలు, తుపాన్ల తో రైతులు రూ.కోట్ల పంటను కోల్పోతున్నారు. 

అడ్డంకులు ఇవే 
జూన్‌ 1 నాటికి నీరు విడుదల చేస్తే జూలై 1 నాటికి నాట్లు పడతాయి. ఈ సమయంలో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు కనీసం 9 వేల క్యూసెక్కులు విడుదల చేయాలి. నైరుతి ఆలస్యమై వర్షాలు పడకుంటే నీటి ఎద్దడి ఏర్పడుతుంది. 2010 ఖరీఫ్‌ ఆరంభంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో సçహజ జలాలు 2 వేల క్యూసెక్కులు మించి ఉండవు. సీలేరు నుంచి వచ్చే అవకాశం తక్కువ. 
∙కాలువలు మూసిన తరువాత పట్టిసీమ ద్వారా నీరు తోడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జూన్‌ 1 నాటికి నీరు విడుదల చేయాల్సి వస్తే ఆ సమయంలో వర్షాలు ఉండనందున పట్టిసీమ నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నీరు విడుదలకు అంగీకరిస్తుందా? అనేది చూడాల్సి ఉంది. 
 
 
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం 
డెల్టాలో మూడు పంటలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్‌ 1 నాటికి నీరు విడుదల చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. 
– రాంబాబు, ఎస్‌ఈ, ధవళేశ్వరం
 

మరిన్ని వార్తలు