అక్రమ కట్టడాల కూల్చివేత!

26 Aug, 2016 19:39 IST|Sakshi
అక్రమ కట్టడాల కూల్చివేత!

ప్రొద్దుటూరు టౌన్‌ :
 మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైందా.. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారా.. ప్లాన్‌ తీసుకోకుండా నిర్మాణం చేస్తున్నారా?.. అయితే ఇక కూల్చి వేస్తారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ బృందం ఇప్పటికే కడప కేంద్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టింది. మున్సిపల్‌ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి ఈ టీంను, జిల్లా సర్వేయర్‌ను ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కూడా పంపాలని కలెక్టర్‌కు విన్నవించారు.
నేడో, రేపో ప్రొద్దుటూరుకు రాక...
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ స్థలాలు చాలా చోట్ల కబ్జాకు గురయ్యాయి. కొందరు స్వార్థపూరిత అధికారుల వల్ల ఏకంగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరిగాయి. మున్సిపల్‌ కార్యాలయం వెనుక వైపు ఉన్న మున్సిపల్‌ స్థలంలో కొందరు ప్రైవేటు కల్యాణ మండపం నిర్మించారు. అలాగే బాలాజీ నగర్‌లో 16 సెంట్ల మరుగుదొడ్డి స్థలాన్ని ఆక్రమించారు. ఇందులో కూడా గృహాలు వెలిశాయి. మరింత స్థలం ఖాళీగా ఉంది. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న రెండో మున్సిపల్‌ కాలనీలో పార్కు స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. వసంతపేట, కోనేటి కాలువ వీధి, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాల్లో కూడా స్థలాలను ఆక్రమించుకున్నారు. రూ. కోట్లు విలువ చేసే స్థలాలు అప్పనంగా కొందరు అమ్మేస్తున్నా వాటిని కాపాడటానికి అధికారులు చర్యలు చేపట్టలేదు. మున్సిపల్‌ లేఅవుట్, మ్యాప్‌ల ఆధారంగా ఎన్ని చోట్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయి అనే విషయాన్ని మొదట ఈ టీం గుర్తిస్తుంది. అలాంటి వాటిపై ఎవ్వరికీ ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏకంగా వాటిని కూలదోసేందుకు కావాల్సిన చట్టపరమైన అన్నింటికి సంబంధించిన సమాచారం ఈ టీం సభ్యుల్లోని అధికారుల వద్ద ఉంటుంది.
మేల్కోకపోతే చర్యలు తప్పవు:
అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న వారు ఇప్పటికైనా మేల్కోకపోతే ఆర్థికంగా బాగా దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేయకుండా, గృహానికి ప్లాన్‌ తీసుకొని దుకాణాలు నిర్మిస్తున్న వారు కొందరైతే, ఏకంగా ప్లాన్‌ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్న వారు మరికొందరు ఉన్నారు. వీరంతా నిర్మాణాలను ప్లాన్‌ మేరకు నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది.
అధికారులపై కూడా ఆరోపణలు:
మున్సిపాలిటీ స్థలాలు ఎక్కడున్నాయి, ప్రభుత్వ స్థలం ఎంత ఉంది అనే సమాచారం మొత్తం మున్సిపాలిటీ, మండల సర్వేయర్ల వద్ద ఉంటుంది. అందుకు కావాల్సిన ప్లాన్‌లు, లేఅవుట్‌లు కూడా వారి వద్ద లభిస్తాయి. ఇందులో కొందరు స్వార్థం కోసం మున్సిపల్, ప్రభుత్వ స్థలాలను కొందరు బడాబాబులకు తెలిపి అందులో నిర్మాణాలు చేసేందుకు సహకరించారనే దానిపై కూడా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి.
స్పెషల్‌ టీంతో మున్సిపల్‌ ఆక్రమణ స్థలాలపై చర్యలు
 స్పెషల్‌ టీం ప్రొద్దుటూరుకు కూడా కావాలని కలెక్టర్‌ను కోరా. త్వరలో ఈ టీం ప్రొద్దుటూరుకు వస్తుంది. అక్రమ కట్టడాలు, మున్సిపల్‌ స్థలాల్లో నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటుంది.
    – ఉండేల గురివిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌
 
 

మరిన్ని వార్తలు