విజృంభిస్తున్న డెంగీ

24 Sep, 2016 00:57 IST|Sakshi
విజృంభిస్తున్న డెంగీ
  • జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
  • ఎంజీఎంలో ఒకే రోజు 17 కేసులు నమోదు
  • బాధితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రి వార్డులు 
  • ఎంజీఎం : 
    జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భీతిల్లిపోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో విషజ్వరాలతో పాటు డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది వర్షకాలంలో జ్వరపీడితుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న చినుకులతో ఏజెన్సీతో పాటు నగరంలోని ప్రజలు జ్వరాలతో గజగజ వణుకుతున్నారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వారం రోజుల నుంచి విషజ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించగా గురువారం ఒక్క రోజే 17 మంది డెంగీతో బాధపడుతున్నట్లు తేలింది.
     
    ఏజెన్సీలో విస్తరిస్తున్న మలేరియా...
    ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట గూడూరు, కొత్తగూడ మండలాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు 414 మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత  సీజన్‌లో 81 వేల మంది జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతుండగా 41 వేల మంది డయేరియాతో అస్వస్థతకు గురై చికిత్స పొందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
     
    300 మంది చిన్నారులకు చికిత్స
    ఎంజీఎం పిల్లల విభాగంలోని 130 పడకల్లో 300 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నా రు. పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక్కో దానిపై ఇద్దరు చిన్నారులను ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. అదనపు వార్డులను ఏర్పాటు చేయాల్సిన అధికారులు, పరిపాలన అధికారులకు అదనపు బాధ్యతలు తోడవ్వడంతో ఆస్పత్రిలో పాలన కుంటుపడుతుంది.
     
    ఇప్పటివరకు 32 కేసులు నమోదు
    ప్రస్తుత నెలలో ఇప్పటివరకు 32 డెంగీ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు చెప్పారు. వీరంతా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు.జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 105 డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నగర పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రాంతాలకు చెందిన ప్రజలే ఎక్కువగా ఇందులో ఉన్నారని తెలిపారు.
     
    మెరుగైన వైద్యం అందించాలి
    వ్యాధులు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో పేద రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లక తప్పడంలేదు. ఎంజీఎంలోని వార్డులు సైతం రోగులతో నిండిపోయి కిటకిటలాడుతుండడంతో పాటు ఒకే మంచానికి ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచుతూ చికిత్సలు అందిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి పేద రోగులకు మెరుగైనా వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వార్తలు