ప్లేట్‌లెట్స్‌ తగ్గితే డెంగ్యూ కాదు

21 Sep, 2016 00:05 IST|Sakshi
నీటిలోని లార్వాను చూపుతున్న డాక్టర్‌ రాంబాబు
  • జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రాంబాబు
  • నాయకన్‌గూడెం (కూసుమంచి): ప్లేట్‌లెట్స్‌ తగ్గినంత మాత్రాన డెంగ్యూ జ్వరం సోకినట్టు కాదని జిల్లా మలేరియా అధికారి(డీఎంఓ) డాక్టర్‌ అయ్యదేవర రాంబాబు స్పష్టం చేశారు. నాయకన్‌గూడెంలో డెంగ్యూ సోకిన మహిళను ఆయన మంగళవారం పరీక్షించారు. గ్రామంలో అపరిశుభ్రత, నీటి నిల్వల నివారణపై  గ్రామస్తులకు సూచనలు చేశారు. అనంతరం, కూసుమంచిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘జ్వరం వచ్చి, ప్లేట్‌లెట్స్‌ పడిపోతే డెంగ్యూ సోకిందేమోనని అనేకమంది భ్రమపడుతున్నారు.. భయపడుతున్నారు. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు ప్లేట్‌లెట్స్‌ పడిపోవడమనేది సహజం. ఇలాంటప్పుడు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని, జావ వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి’’ అని చెప్పారు.
    ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడి వద్దకువెళ్లండి
    ‘‘వరుసగా ఐదు రోజులపాటు తీవ్ర జ్వరం, కళ్లు లాగటం లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వీటితోపాటు ఒంటిపై ఎర్రటి మచ్చలు కనిపిస్తే.. డెంగ్యూ లక్షణాలుగా గుర్తించాలి’’ అని వివరించారు.

    • దోమల నివారణ ఇలా...

    జ్వరాల నివారణపై వైద్య బృందం అప్రమత్తంగా ఉందన్నారు. 536 ఆవాస ప్రాంతాల్లో ‘అత్యవసర పరిస్థితి’ ఉన్నట్టుగా  గుర్తించి  వైద్య సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. దోమల వ్యాప్తితో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయన్నారు. నిల్వ ఉన్న శుభ్రమైన నీటిలోనే దోమలు లార్వాను విడుస్తాయన్నారు. ప్లాస్టిక్‌ డబ్బాలు, పడేసిన టైర్లు,  కూలర్లు, నీటి తొట్లు, పడేసిన కొబ్బరి బోండాల్లో దోమల లార్వా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వీటిని నివారిస్తే దోమలను అరికట్టవచ్చన్నారు. నీటి గుంతల్లో కిరోసిన్‌ పోస్తే లార్వా నశిస్తుందన్నారు.

    • గతంతో పోలిస్తే తగ్గిన కేసులు

    గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో జ్వరాలు తగ్గినట్టు చెప్పారు. గత ఏడాది డెంగ్యూ కేసులు 439 ఉండగా ఈసారి 326కు, చికున్‌గున్యా కేసులు 54 ఉండగా ఈసారి 6, మలేరియా కేసులు 1822 ఉండగా ఈసారి 747కు తగ్గినట్టు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క బోనకల్‌ మండలంలోనే అత్యధికంగా 66 డెంగ్యూ కేసులు నమోదైనట్టు తెలిపారు. ‘‘ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరంతో వెళ్లిన మొదటి రోజునే ఎన్‌ఎస్‌-1 టెస్ట్‌ చేస్తున్నారు. ఈ టెస్టులను ప్రభుత్వం నిషేధించింది’’ అని చెప్పారు. డెంగ్యూ ప్రాణాంతకం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని చెప్పారు. సమావేశంలో మెడికల్‌ ఆఫీసర్‌  డాక్టర్‌ ఖాజా కలీముద్దీన్‌, ఏఎంఓ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, హెచ్‌ఈఓ మహ్మద్‌ వలీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు