నువ్విస్తానంటే... నేనొద్దంటా!

31 Aug, 2017 02:01 IST|Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : దాతలు దానం ఇచ్చిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాతలు రూ.కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చినా.. అధికారులు మాత్రం దేవాలయాల పరిధిలోకి తీసుకురావడం లేదు. అధికారుల అలసత్వాన్ని అడ్డుపెట్టుకొని కొందరు అక్రమార్కులు వారసుల పేరుతో విలువైన ఆస్తులను స్వాహా చేస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలు అందిస్తున్నారు.

ఇదీ ఆస్తుల దానం అసలు కథ...
విజయవాడ వన్‌టౌన్‌ కొత్తపేటకు చెందిన బంకా కామరాజుకు చిట్టినగర్‌ ప్రాంతంలోని కామరాజు వీధిలో అసెస్‌మెంట్‌ నెంబర్‌ 4145లో 1,200 గజాల భూమి, విజయవాడ రూరల్‌ మండలంలోని గొల్లపూడిలో సర్వే నంబర్‌ 394/1, 2, 3, 4లలో 2.10 ఎకరాలు, విద్యాధరపురంలో ఆర్‌ఎస్‌ నంబర్‌ 81/1, 81/2ఎ,81/2లలో 6.64 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఆ భూముల విలువ రూ.30 కోట్లకు పైగా ఉంటుంది.

ఈ ఆస్తులను 1970లో తన చిన్న కుమార్తె సీతారామమ్మ తదనానంతరం స్థానిక నగరాల రామాలయానికి చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్‌ చేశారు. కామరాజుకు  ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా, కుమారులు తండ్రిని పట్టించుకోకపోవడంతో చిన్నకుమార్తె సీతారామమ్మ వద్ద ఉండేవారు. అందువల్ల సీతారామమ్మ తదనానంతరం తన ఆస్తులను నగరాల రామాలయానికి చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఎనిమిది నెలల కిందట ఈ రిజిస్టర్డ్‌ వీలునామా పత్రాలు దేవాదాయ శాఖ కార్యాలయంలో బయపడ్డాయి.

ఇదీ ప్రస్తుత పరిస్థితి...
కామరాజు దేవాలయానికి ఇచ్చిన ఆస్తులపై కొందరు స్వార్థపరుల కన్నుపడింది. ఆ ఆస్తులకు తాము వారసులమంటూ స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్టర్డ్‌ వీలునామా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలతో కలిసి రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మక్కై రికార్డులనే మార్చేశారు. కొత్తపేటలో ఉన్న విలువైన స్థలాలను దశల వారీగా విక్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల విలువైన స్థలాలను విక్రయించారు. గొల్లపూడి ప్రాంతంలో ఉన్న భూములను సైతం కాజేసేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. అయితే, సీతారామమ్మ కుమార్తె న్యాయవాది అయిన రమణి వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. మరోవైపు కొత్తపేటకు చెందిన దుర్గాసి వెంకయ్య మఠానికి చెందిన 800 గజాల స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించుకుని విక్రయిస్తున్నారు. దీని వలువ రూ.10 కోట్లు ఉంటుంది.

మాకు అధికారాలు ఇవ్వలేదు..
నగరాల రామాలయం దేవాదాయ శాఖలో ఉన్నప్పటికీ పూర్తి అధికారాలు మాత్రం పాలకవర్గమే తీసుకుంది. మా పోస్టు నామమాత్రమే. ఒక్క రికార్డు కూడా మాకు ఇవ్వలేదు. దీంతో మేం ఏం చేయలేము.
– సత్యప్రసాద్‌బాబు, నగరాల రామాలయం ఈఓ

నన్ను ముప్పుతిప్పలు పెట్టారు
మా తాత కామరాజు ఆస్తులను నగరాల రామాలయానికి చెందేలా వీలునామా వాసి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ విషయం ఇటీవల  దేవా దాయ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నేనే చెప్పాను. రూరల్‌ ప్రాంతంలో ఉన్న భూములు నా ఆధీనంలో ఉన్నాయి. ఆ భూములను కాజేసేందుకు కొందరు నన్ను ముప్పుతిప్పలు పెట్టారు. నాపై తొమ్మది కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అయినా ఆ భూములు ఆలయానికి ఇచ్చే వరకు పోరాటం చేస్తా.     – రమణి, సీతారామమ్మ కుమార్తె

మరిన్ని వార్తలు