డిపాజిట్లు గల్లంతైతే..

26 Aug, 2016 22:07 IST|Sakshi
డిపాజిట్లు గల్లంతైతే..
 పాలక వర్గాల కనుసన్నల్లో కోఆపరేటివ్‌ బ్యాంకులు 
ఏపీఎంపీసీఎస్‌–1995 చట్టంలోకి మార్చేందుకు బోర్డుల యత్నాలు
ఈ చట్టపరిధిలోకి వెళితే ప్రభుత్వ నియంత్రణ శూన్యం
ఎజెండాలో చేర్చిన ది ఇన్నీసుపేట ఆర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ 
అదే దారిలో ది ఆర్యాపురం, ది జాంపేట బ్యాంకులు
 
సహకార బ్యాంకుల్లో డిపాజిట్లకు ఇక సర్కారీ రక్షణ కరువవనుంది. చాలా బ్యాంకుల పాలకవర్గాలు 1995లో చేసిన ఏపీఎంపీసీఎస్‌ చట్ట పరిధిలోకి మారాలనుకుంటుండడమే దీనికి కారణం. దీనివల్ల సహకరా బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ కరువై పాలకమండళ్ల ఇష్టారాజ్యం మెుదలవుతుంది. అప్పుడు బ్యాంకుల్లో yì పాజిట్లు గల్లంతైతే బాధ్యులెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
 
సాక్షి, రాజమహేంద్రవరం : 
పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతికి, చిన్న వర్తకుల అభివృద్ధికి పరస్పర సహకార స్ఫూర్తితో స్థాపించిన సహకార బ్యాంకులపై పెద్దల కన్ను పడింది. వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్న బ్యాంకులను తమ కనుసన్నల్లో ఉంచుకునేందుకు పాలక మండళ్లు పావులు కదుపుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో చిన్న, మధ్యతరగతి వర్తకుల ఆర్థిక అవసరాలు తీర్చాలన్న మహోన్నత ఆశయంతో స్వాతంత్య్రానికి పూర్వమే సహకార బ్యాంకులు వెలిశాయి. ప్రారంభంలో తమంతట తామే నిధులు సమకూర్చుకున్న ఈ బ్యాంకులకు అనంతరం కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సహకార సంస్థల చట్టం (ఏపీసీఎస్‌–1964) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంకులపై నియంత్రణ కలిగిఉంది. ఈ చట్టంలో పొందుపరిచిన విధివిధానాల ఆధారంగా సహకార బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టం ఉండగానే ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం(ఏపీఎంపీసీఎస్‌–1995)ను ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం వల్ల పాలక మండళ్లకు బ్యాంకుల వ్యవహారాలపై పూర్తి అధికారం ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి 1964 చట్టంలో ఉన్న పలు బ్యాంకులను ఆయా పాలక వర్గాలు ఇప్పుడు 1995 చట్టం పరిధిలోకి మార్చాలని యత్నిస్తున్నాయి. 
ప్రభుత్వ అజమాయిషీ సున్నా...
ఏపీఎంపీసీఎస్‌–1995 చట్ట పరిధిలోకి సహకార బ్యాంకులు వెళ్లడం వల్ల బ్యాంకు ఆర్థిక వ్యవహారాలు, ఇతర కార్యకలాపాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. పాలక మండళ్లే స్వేచ్ఛగా విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో డిపాజిటర్ల నగదుకు రక్షణ కరువవుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు బ్యాంకులకు అందవు. పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో అంశాలపై నిబంధనలు రూపొందించే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. 1964 చట్టం ప్రకారం ప్రతి ఆరునెలలకోసారి సహకార విభాగంలోని ఆడిట్‌శాఖ బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తుంది. అయితే 1995 చట్టం ప్రకారం ఆడిట్‌ వ్యవహారం పూర్తిగా పాలకమండళ్ల చేతిలో ఉంటుంది. పాలక మండలి నియమించిన ప్రైవేటు వ్యక్తి చేసే ఆడిట్‌లో మండలి కలుగజేసుకునే అవకాశం ఉంటుంది. 1964 చట్టం ప్రకారం బ్యాంకుల విస్తరణ, వ్యాపారాభివృద్ధికి నిధులు వినియోగించాలంటే సహకార సంస్థల రిజిస్ట్రార్‌ అనుమతి తప్పనిసరి. 1995 చట్టం పరిధిలోకి వస్తే ఎంతమొత్తంలోనైనా నిధులు వినియోగించవచ్చు. 
ఉద్యోగుల నియామకం.. పాలక మండలి ఎన్నికలు...
1964 చట్టం పాలక మండలి ఎన్నికలు ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొంటోంది. అయితే 1995 చట్టం ప్రకారం అధికారంలో ఉన్న బోర్డు ఎన్నికలు నిర్వహించాలని తెలుపుతోంది. సభ్యత్వం మంజూరులో కూడా పాలక మండలిదే నిర్ణయం. ఉద్యోగులను కూడా పాలక మండలి నియమించుకునే అధికారం ఉండడంతో నియామకాల్లో అక్రమాలు జరిVó  అవకాశం ఉంటుంది. అర్హులైన, సమర్థత కలిగిన ఉద్యోగులు వచ్చే అవకాశం ఉండదు. రుణాల మంజూరులోనూ పాలక మండలికి పూర్తి స్వేచ్ఛ ఉండడంతో అనర్హులకు రుణాలు మంజూరయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల డిపాజిటర్ల నగదుకు రక్షణ ఉందదు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే కృషి బ్యాంక్‌ తరహాలో ఈ బ్యాంకులు దివాళా తీసే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో నగదు దాచుకున్న వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు రోడ్డునపడే ప్రమాదం ఉంది.
ఉవ్విళ్లూరుతున్న పాలక మండళ్లు...
జిల్లా వ్యాపారకేంద్రమైన రాజమహేంద్రవరంలో ది ఆర్యాపురం, ది జాంపేట, ది ఇన్నీసుపేట అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఏపీసీఎస్‌–1964 చట్టం ప్రకారం ఇవి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో పలు శాఖలు ఉన్న ఈ బ్యాంకులు వందల కోట్ల టర్నోవర్‌ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం పాలక మండళ్లు ఈ బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాంకులను ఏపీఎంపీసీఎస్‌–1995 చట్ట పరిధిలోకి మార్చాలని పాలక మండలి సభ్యులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈనెల 28న(ఆదివారం) ది ఇన్నీసుపేట అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న సాధారణ మహాజనసభ సమావేశంలో బ్యాంకును 1995 చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని అజెండాలో పొందుపరిచారు. త్వరలో జాంపేట, ది ఆర్యాపురం బ్యాంకులను కూడా ఆయా పాలకమండళ్లు ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.  
 పాలక మండళ్లదే అధికారం
బ్యాంకులు ఏపీఎంపీసీఎస్‌–1995 చట్ట పరిధిలోకి వెళితే ఆర్థిక, పాలన వ్యవహారాల్లో పాలక మండళ్లదే తుది నిర్ణయం. ఉద్యోగుల నియామకం కూడా మండలే చేపడుతుంది. ఒక ఏడాదిలో బ్యాంకుకు నష్టం వస్తే మరుసటి ఏడాదికి బదలాయించడానికి వీలుండదు. దాని కోసం ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రుణాలు ఇవ్వడంలో పాలక మండలిదే తుది నిర్ణయం. ప్రభుత్వ తనిఖీలు ఉండవు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే బ్యాంకు కుప్పకూలుతుంది. 
– సింగరాజు రవిప్రసాద్, సెక్రటరీ, ది జాంపేట కోఆపరేటీవ్‌ అర్బన్‌ బ్యాంక్‌ 
 
మరిన్ని వార్తలు