వాహన రిజిస్ర్టేషన్ల ఆలస్యానికి కారణం అదే!

24 Jul, 2016 08:56 IST|Sakshi
వాహన రిజిస్ర్టేషన్ల ఆలస్యానికి కారణం అదే!

♦   నిషేధం ఉన్నా దొడ్డిదారిన ఎంవీఐల బదిలీలు..
♦  ఆర్టీఏ కార్యాలయాల్లో నిలిచిపోతున్న పౌరసేవలు

సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖలో ‘ఆన్‌ డిప్యుటేషన్‌’ పెద్ద సమస్యగా మారింది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్నా.. రెండేళ్లుగా ఎంవీఐలు, ఏఎంవీఐలు ఈ ‘మార్గాన్ని’ అడ్డుపెట్టుకుని, ఎవరికి వారు పైరవీలు చేసుకుని తమకు నచ్చిన చెక్‌పోస్టుకు వెళ్లిపోతున్నారు. దీని మూలంగా ఆర్టీఏ కార్యాలయాలకు సిబ్బంది కొరత సవాల్‌ గా మారింది. వీరి స్థానంలో కొత్త అధికారులు రాకపోవడం లేదు. దీంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు, వినియోగదారులకు లెర్నింగ్‌ లైసెన్సులు, రెన్యువల్స్, వాహన బదిలీ వంటి పౌర సేవలు అందించే ఈ కార్యాలయానికి వచ్చే వినియోగదారులకు సకాలంలో పనులు జరగడం లేదు.

అరకొర సిబ్బందితో అవస్థలు..
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాలు, నాలుగు డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లకు పౌరసేవల కోసం రోజూ వేల సంఖ్యలో వాహన వినియోగదారులు వస్తారు. లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీ, సుమారు 1500 మంది లైసెన్సుల కోసం సంప్రదిస్తుంటారు. మరో 1000 మంది వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వస్తుంటారు. ఈ రెండు కేటగిరీలు కాకుండా ఇతరత్రా పౌరసేవల కోసం వందల సంఖ్యలో వినియోగదారులు ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తారు.

ఉప్పల్, తిరుమలగిరి, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, మేడ్చెల్‌ వంటి కార్యాలయాలకు వాహనదారుల రద్దీ భారీగా ఉంటుంది. కానీ ‘ఆన్‌ డిప్యుటేషన్‌’ బదిలీల కారణం గా చాలా చోట్ల ముగ్గురు ఎంవీఐలు చేయాల్సిన పనిని ఒక్కరే చేయాల్సి వస్తోంది. మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయంలో ఒకే ఒక్క ఎంవీఐ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, కనీసం ఐదుగురు ఎంవీఐలు పనిచేయాల్సిన సికింద్రాబాద్‌ వంటి ఆర్టీఏ కార్యాలయంలోనూ ఒక్కరిపైనే పనిభారం పడుతోంది. మేడ్చెల్‌ లో ఇద్దరు ఎంవీఐలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ ఆర్టీఏ పరిధిలో 45 మంది ఎంవీఐలు అవసరముండగా ప్రస్తుతం 22 మంది మాత్రమే ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గత రెండేళ్లుగా 38 మందికి పైగా సిబ్బంది వివిధ కారణాలతో ఆన్‌ డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు.

చెక్‌పోస్టు డ్యూటీల కోసమేనా..
కొంతకాలంగా సాధారణ బదిలీలు, పదోన్నతులు నిలిచిపోవడంతో ఈ తర హా ఓడీ బదిలీలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. చాలామంది ఎంవీ ఐలు ఆఫీస్‌ డ్యూటీల పట్ల విముఖత వ్యక్తం చేస్తూ చెక్‌పోస్టులకు వెళ్లేందుకు పైరవీలు చేసుకుంటున్నారు. చెక్‌పోస్టుల్లో ఎక్కువ శాతం పైఅధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణకు దూరంగా ఉండడం.. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా ఆఫీసుల్లో వచ్చే అక్రమార్జన కంటే చెక్‌పోస్టుల్లో వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు