తెగిన కేఎల్‌ఐ ప్రధాన కాలువ

14 Sep, 2016 00:35 IST|Sakshi
 కోడేరు: కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబొగుడ రిజర్వాయర్‌ ప్రధాన కాలువ మంగళవారం ముత్తిరెడ్డిపల్లి– రాజాపూర్‌ గ్రామాల మధ్యన తెగిపోయింది. దీనికి ప్రధాన కారణం కాంట్రాక్టర్‌ పనులను నాసిరకంగా చేయడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. జొన్నలబొగుడ రెండో లిఫ్ట్‌ ద్వారా మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం కింద ఇక్కడి రైతులకు సాగునీరు అందిస్తున్నారు. నీటి విడుదల జరిగి వారం గడవకముందే పలు చిన్న కాలువలతోపాటు ప్రధాన కాలువలు కూడా తెగిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముత్తిరెడ్డిపల్లి –రాజాపూర్‌ మధ్యన తెగిన కాలువ నుంచి ఒక్కసారిగా నీరు ఉధృతంగా ప్రవహించింది. ఐదెకరాల వరి పంటతోపాటు మరికొందరు రైతుల పంటలు పూర్తిగా నీటమునిగాయి. రాజాపూర్‌కు చెందిన జె.కుర్మయ్య కాడెద్దుల్లో ఒకటి నీటిలో కొట్టుకుపోయి మృతిచెందింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. తెగిపోయిన కాలువలకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలి
జొన్నలబొగుడ రెండో లిఫ్ట్‌ కింద నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు స్పందించాలని కోరారు. రైతులకు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇవ్వడం హర్షనీయమని, అయితే నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 
మరిన్ని వార్తలు