గ్రీన్‌ మార్కెట్‌ యార్డుగా అభివృద్ధి

28 Jan, 2017 21:26 IST|Sakshi
గ్రీన్‌ మార్కెట్‌ యార్డుగా అభివృద్ధి
- శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు
- శరవేగంగా ర్యాంపులు, షెడ్ల నిర్మాణం
- వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ
  రాష్ట్ర కమిషనర్‌ మల్లికార్జునరావు
 
కర్నూలు (వైఎస్‌ఆర్‌సర్కిల్‌): పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కర్నూలు మార్కెట్‌ యార్డును..రెండు నెలల్లో పచ్చదనంతో నింపాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కమిషనర్‌ మల్లికార్జునరావు ఆదేశించారు. శనివారం ఉదయం ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర యార్డులను పరిశీలించిన అనంతరం సాయంత్రం ఆయన కర్నూలు మార్కెట్‌ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యార్డులోని కూలేందుకు సిద్ధంగా ఉన్న షెడ్లతో పాటు శిథిలావస్థలోని గోదాములను పరిశీలించారు. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జంబో గోదామును తనిఖీ చేసి మార్చిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
 
పారిశుద్ధ్యం లోపించిన మరుగుదొడ్లను, షెడ్ల వద్ద ఉన్న అపరిశుభ్రతను గమనించి.. అధికారులకు సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్‌ పథకం కింద యార్డుల్లో పచ్చదనం వెల్లవిరిసేలా బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంగవైకల్యం కల్గిన రైతులు గోదాములోకి వెళ్లేలార్యాంపుల నిర్మాణం శరవేగంగా జరగాలని ఆదేశించారు.మార్కెట్‌ల శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. కూలిని పెంచాలని హమాలీలు.. కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. వ్యాపారులు, రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి కమిషనర్‌ భరోసానిచ్చారు. మార్కెటింగ్‌ శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు సుధాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి నారాయణమూర్తి, సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు