గిరిసీమల్లో రహదారిద్య్రం

24 Aug, 2017 03:43 IST|Sakshi
గిరిసీమల్లో రహదారిద్య్రం

సాక్షిప్రతినిధి విజయనగరం: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మూడేళ్లుగా రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొత్త రోడ్ల నిర్మాణం జరగలేదు. నిధులున్నా ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, పాలకుల నిర్లక్ష్యం వల్ల నేటికి దారులు ఏర్పడలేదు. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి దూరమవుతున్నారు. చదువు కోవడానికి వెళ్లలేక గిరిజన యువత నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు.

నెలకోసారి నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకునేందుకు కొండలు గుట్టలు ఎక్కి దిగి కిలోమీటర్ల దూరం నడిచి అవస్థలు పడుతున్నారు. సాలూరు నియోజకవర్గంలోని పలుగ్రామాలకు రహదారులకు ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేశారు. ఆ పనులు సైతం పూర్తికాలేదు. మెంటాడ మండలంలో రూ. 4కోట్లతో జగన్నాథపురం, రెడ్డివానివలస, గజంగుడ్డివలస, మూలపాడు గ్రామాలకు ఈ ఏడాది మట్టిరోడ్ల నిర్మాణం చేపట్టారు. సోషల్‌ ఆడిట్‌లో పలు అవకతవకలు జరిగినట్టు గుర్తించడంతో పనులు నిలిచిపోయాయి. మక్కువ మండలంలో రూ.35కోట్ల రూపాయలతో 11 గ్రామాలకు రహదారులు మంజూరయ్యాయి.

మూలవలస నుంచి కంజుపాక గ్రామానికి నిధులు మంజూరైనా అటవీశాఖ అడ్డంకులు కారణంగా పనులు నిలిచిపోయాయి. బాగుజోల నుంచి చిలకమెండంగి రోడ్డు పూర్తిగా రాళ్లు తేలి కనిపిస్తోంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, డెన్సరాయి, సంపంగిపాడు, కొదమ, జిల్లేడువలస తదితర గిరిశిఖర గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదు. మైదానప్రాంతంలోని పంచాయతీ కేంద్రమైన అన్నంరాజువలస గ్రామానికి, తోణాం పంచాయతీ మెట్టవలస, కొత్తవలస పంచాయతీలోని బుట్టిగానివలస, మరిపల్లి పంచాయతీలోని గడివలస ఇలా చాలా గ్రామాలకు వెళ్లాలంటే నరకమే.

చందాలతో రోడ్ల నిర్మాణం
అధికారులు, పాలకుల మీద నమ్మకం సన్నగిల్లి సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు గ్రామాల ప్రజలు ఇంటింటికీ చందాలు వేసుకుని, శ్రమదానం చేసి, వసూలైనసొమ్మును ఖర్చుచేసి రోడ్డును వేయించుకున్నారు. రూ. 49 లక్షలతో సాలూరు మండలం పసుపువానివలస నుంచి లోవవలసకు 1.2 కిమీ తారు రోడ్డు వేశారు. గ్రామానికి అరకిలోమీటరు దూరంలో పనులు నిలిపేశారు. పెదపధం పంచాయతీ దుక్కడవలస సమీపంలోని తామరకొండ వైపునకు 40 లక్షలతో సుమారు 800 మీటర్ల తారు రోడ్డు వేశారు.

కొండ నుంచి కూతవేటు దూరంలోనున్న దుక్కడవలస గ్రామానికి రోడ్డు వేయలేదు. కొత్తవలస పంచాయతీలోని సుంకరిబంద చెరువుకు కంకర  రోడ్డును ఐటీడీఏ నిధులతో వేశారు. పక్కనేవున్న బుట్టిగానివలసకు రోడ్డు వేయకపోవడం గమనార్హం. మక్కువ మండలంలోని మెండంగి, చిలకమెండంగి, బాగుజోల, బీరమాసి గ్రామాలకు చెందిన గిరిజనులు మైదాన ప్రాంతాలకు దూరంగా కొండల సమీపంలో నివశిస్తున్నారు. ఆయా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కరకవలస గ్రామం నుంచి సుమారు 10 కిమీ దూరంలోవున్న మారిక గ్రామం వెళ్లాలంటే రాళ్లు–రప్పలు, ముళ్లు–తుప్పలు మద్య మూడుకొండలు ఎక్కిదిగాల్సిందే.

>
మరిన్ని వార్తలు