దేవీ వైభవం

1 Oct, 2016 23:50 IST|Sakshi
దేవీ వైభవం
 • జిల్లా అంతటా శరన్నవరాత్రులు ప్రారంభం
 • అన్నవరం:
  రత్నగిరిపై శరన్నవరాత్రి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు స్వామివారి ప్రధానాలయంలో రుత్విక్కుల మంత్రోచ్చారణల మధ్య పూజలకు అంకురార్పణ చేశారు. సంకల్పం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరుణ, దీక్షా వస్త్రధారణ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా నవరాత్రి వేడుకల్లో అమ్మవారికి పూజలు చేసే రుత్విక్కులకు దీక్షా వస్త్రాలను చైర్మన్, ఈఓ అందజేశారు.
  తొలిరోజు బాల అవతారంలో..
  శరన్నవరాత్రుల్లో దుర్గామాతలను రోజుకో అవతారంలో అలంకరించి పూజలు చేస్తారు. కాగా తొలిరోజు శనివారం కనకదుర్గ, వనదుర్గ అమ్మవార్లను ‘బాల’ అవతారంలో అలంకరించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరుగంటల వరకూ అమ్మవార్లకు లక్షకుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తీర ్థప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమాలను దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఇతర రుత్విక్కులు పాల్గొన్నారు.
  రజిత కవచ అలంకారంలో వెదురుపాక విజయదుర్గా అమ్మవారు
  వెదురుపాక(రాయవరం) : మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శనివార ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పీఠాధిపతి సతీమణి సీతమ్మవారు కలశస్థాపన పూజలు చేశారు. తొలిరోజు 1,152 మంది భక్తులు కలశాలను ఏర్పాటు చేసుకున్నారు. విజయదుర్గా అమ్మవారిని రజిత కవచ అలంకారంలో పలు రకాల పూలు, సర్వాభరణాలతో నయనానందకరంగా  అలంకరించారు. భక్తుల నుద్దేశించి పీఠాధిపతి గాడ్‌ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పారిశ్రామికవేత్తలు ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, డి.రాజశేఖర్, కర్రి వెంకటకృష్ణారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.  పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వీవీ బాపిరాజు, పీఆర్వో వి.వేణుగోపాల్‌(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు  అన్న సమారాధన నిర్వహించారు. 
   
మరిన్ని వార్తలు