అమ్మ సన్నిధిలో అగచాట్లు

20 May, 2016 15:48 IST|Sakshi
అమ్మ సన్నిధిలో అగచాట్లు

విజయవాడ : కష్టాలు తీర్చమ్మా.. కనకదుర్గమ్మా.. అంటూ వచ్చే    భక్తులకు అమ్మ సన్నిధిలోనూ కష్టాలు తప్పట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దయినా కొద్దిసేపు సేదతీరే అవకాశం లేకపోగా, ఎంతసేపైనా నిలబడే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దవుతున్నారు. ఆలయ ప్రాంగణంలోనే కాదు కనీసం ఆ పరిసరాల్లో కూడా అధికారులు ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయలేదు. చేసేదేమీలేక అమ్మపైనే భారం వేసి వర్షంలోనే తడుస్తూ క్యూలైన్‌కు చేరుకుంటున్నారు.
 
కొండ కిందా ఇదే పరిస్థితి
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తొలుత కనకదుర్గానగర్‌లో బస్సుల కోసం వేచి చూస్తూ వర్షంలో తడుస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్‌లోని క్యూలైన్‌కు చేరాలన్నా ఎలాంటి షెడ్డూ లేదు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు రాజగోపురం నుంచి బయటకు రావాలన్నా వర్షంలో తడుస్తూ రావాల్సిందే.
 
అధికారులూ.. స్పందించండి
రానున్నది వర్షాకాలం కావడంతో ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడే స్పందించకుంటే కృష్ణా పుష్కరాలు, దసరా ఉత్సవాల సమయంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు