మెతక వైఖరి వెనుక మతలబు ఏంటి?

24 Sep, 2016 08:37 IST|Sakshi

మాజీ మంత్రి వడ్డే
 
ఉయ్యూరు : కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల పట్ల సీఎం చంద్రబాబు ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. ఉయ్యూరులోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఎఫెక్స్ కౌన్సిల్ ఎదుట పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పడం బాగానే ఉంది.

అదే వైఖరితో ఉండకుండా ఒక కమిటీ వేసి దామాషా ప్రకారం నీళ్ల పంపకానికి ఎందుకు అంగీకరించావు, కర్ణాటకలో కావేరీ జలాలపై హక్కు కోసం ఆ రాష్ట్రంలో పోరాటం చేస్తుంటే ఇక్కడ మాత్రం నీవెందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నావు... మెతక వైఖరి వెనుక మతలబు ఏంటి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును వడ్డే ప్రశ్నించారు. కృష్ణాజలాల విషయంలో బాబు వైఖరి వల్ల డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
 
మంగళగిరిలో ఎయిర్‌పోర్టు ఎందుకు..
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతుంటే మరోపక్క మంగళగిరిలో ఐదు వేల ఎకరాలను కేటాయిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం సరైందికాదని వడ్డే అన్నారు. విభజన చట్టంలో తిరుపతి, గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చే వీలున్నప్పుడు కొత్తగా ఎయిర్‌పోర్టులు ఎందుకని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణం పేరుతో హడ్కో నుంచి అప్పులు తెచ్చుకోవడం తప్ప చేసేదేముందన్నారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు.
 
 వడ్డేను కలిసిన ధనేకుల
ఉయ్యూరులో శుక్రవారం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావును డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్ కలిశారు. బందరు పోర్టు భూములపై రైతు పక్షాన పోరాటం, ప్రత్యేక హోదా, తదితర అంశాలపై చర్చించారు.  అనంతరం ధనేకుల విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజీలో ఆంతర్యమేమిటో ప్రజలకు అర్థమైందన్నారు.

చంద్రబాబు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు ప్రజలను మభ్యపెడుతూ గందరగోళానికి గురిచేసి సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజపీ, టీడీపీ మోసపూరిత విధానాలపై పోరాడి ప్రజలను చైతన్యుల్ని చేస్తామన్నారు. దాసు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు