-

ధర అదిరె.. అమ్మకానికి బెదిరె

20 Dec, 2016 01:40 IST|Sakshi
తాడేపల్లిగూడెం : బహిరంగ మార్కెట్‌లో ధాన్యం ధర పెరిగింది. కానీ.. అమ్మడానికి రైతులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.65 అదనంగా చెల్లించేందుకు మిల్లర్లు, ధాన్యాం వ్యాపారులు ముందుకొస్తున్నా 30 శాతం రైతులు ధాన్యాన్ని అమ్మకుండా నిల్వ ఉంచుతున్నారు. జిల్లాలో ఎక్కువ మంది రకాన్ని స్వర్ణ రకాన్ని సాగు చేయగా, దీనిని కామన్‌ వెరైటీగా గుర్తించిన ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,470 మద్దతు ధర ప్రకటించింది. ఐకేపీ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.1,535 చెల్లిస్తున్నా రైతులు ధాన్యం అమ్మడానికి విముఖత చూపుతున్నారు. సొమ్ము సకాలంలో చేతికందే పరిస్థితి లేకపోవడం, వ్యాపారులు ఇస్తున్న చెక్కుల్ని బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ధాన్యాన్ని అమ్మడం లేదు. జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఐకేపీ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 48,408 మంది రైతుల నుంచి 4,77,113 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామని, రూ.704 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉండగా, రూ.604 కోట్లు చెల్లించామని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ కె.గణపతి రావు తెలిపారు. మరో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేసినట్టు అంచనా. ఇంకా 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయిందని అధికారులు భావిస్తున్నారు. 
 
సొమ్ములున్నా తీసుకోలేని దుస్థితి
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అయినా తీసుకోలేని దుస్థితి నెలకొంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా సొమ్ము రైతులకు సొమ్ములు ఇవ్వడం లేదు. చేతిలో సొమ్ముల్లేక రబీ నారుమడులు, నాట్లు ఎలా వేయాలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు. పోనీ.. కమీషన్‌దారులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుందామన్నా.. రబీ సీజన్‌లో చేసిన అప్పులను తిరిగి చెల్లించకపోవడంతో వారినుంచి రుణాలు అందటం లేదు. తొలి దశలో ఎకరాకు రూ.5 వేలైనా పెట్టుబడి అవసరం ఉంటుంది. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు.  
 
సొమ్ము రావట్లేదని ధాన్యం అమ్మలేదు  
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మినా సొమ్ము చేతికి అందటం లేదు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముదామంటే చెక్కులిస్తామంటున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేక ధాన్యాన్ని అమ్మలేదు. ఇంట్లోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత పంట సొమ్ము రాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు చేద్దామంటే ఇచ్చేవాళ్లు లేరు. కొత్త పంట ఎలా వేయాలో అర్థం కావడం లేదు. – గరగ ప్రభాకరరావు, రైతు, మాధవరం
 

 

మరిన్ని వార్తలు