అనారోగ్యశ్రీగా మార్చారు

9 Dec, 2016 22:38 IST|Sakshi
అనారోగ్యశ్రీగా మార్చారు
 ఏలూరులో భారీ ధర్నా
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఖరిని నిరసించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అన్యాయానికి గురైన పేదల స్థితిగతులను చూసి చలించిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌కు మంచిపేరు వచ్చిందనే అక్కసుతో చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకం పేరు కూడా మార్చాడని తెలిపారు. రేషన్‌ కార్డుతో పాటు హెల్త్‌కార్డు ఉండాలనే నిబంధనలు తీసుకొచ్చి పేద రోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. మహానేత ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తే చంద్రబాబు ఆ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చయ్యే ఈ పథకానికి బడ్జెట్‌లో రు.100 కోట్లు కూడా కేటాయించకుండా చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. పేదల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు కారుమూరి నాగేశ్వరరావు, ఘంటా మురళీరామకృష్ణ, తెల్లం బాలరాజు, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, గుణ్ణం నాగబాబు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, కొఠారి రామచంద్రరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సాయిబాలపద్మ పాల్గొన్నారు. 
 

 

మరిన్ని వార్తలు